2 September, 2026 | 1:38 PM

గజ్వేల్‌ను పట్టించుకోని కేసీఆర్‌

02-09-2026 | 12:55pm

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ

గజ్వేల్,సెప్టెంబర్ 1: గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో లేకుండా నియోజకవర్గాన్ని పట్టించుకోని మాజీ సీఎం కేసీఆర్‌(KCR) వెంటనే గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ పిలుపు మేరకు గజ్వేల్(Gajwel) పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్ సర్దార్ ఖాన్, డీసీసీ ఉపాధ్యక్షుడు మొనగారి రాజు, మాజీ కౌన్సిలర్ సమీర్ నక్క రేగొండ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.

కేసీఆర్‌ వెయ్యి రోజులుగా గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేకపోయినా జీతభత్యాలు, ప్రభుత్వ సౌకర్యాల రూపంలో రూ.2.24 కోట్లకు పైగా పొందారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయలేని కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.