మరోసారి చరిత్ర సృష్టించిన చైనా
చంద్రుని ఆవలివైపు నమూనాల సేకరణ
ఈ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు
చైనా, జూన్ 25 : డ్రాగన్ కంట్రీ చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి చంద్రుడికి ఆవలివైపు గల మట్టి నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చైనా ప్రయోగించిన చాంగే శాటిలైట్ చంద్రుడి రెండోవైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకొని మంగళవారం భూమిని చేరుకుంది. మే 3న నింగిలోకి వెళ్లిన చాంగే దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి భూమిపైకి చేరింది.
ఈ నౌక చంద్రుని ఉపరితలంపై డ్రిల్ చేసి మట్టిని, రాళ్లను సేకరించింది. 25 లక్షల ఏళ్ల నాటి ఆగ్ని పర్వత శిలలు, ఇతర పదార్థాలు ఈ నమూనాల్లో ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. గతంలో అమెరికా, రష్యా దేశాలు చంద్రుని ఇవతలి వైపు నుండి నమూనాలు సేకరించాయి. అయితే, చంద్రుని అవతలి వైపు నమూనాలు సేకరించిన మొదటి దేశంగా చైనా రికార్డుకెక్కింది. వచ్చింది. నమూనాలపై పరిశీలన జరిపితే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.






