లోక్‌సభలో తెలంగాణం
తెలుగులోనే ప్రమాణం చేసిన పలువురు ఎంపీలు
జైతెలంగాణ, స్థానిక దేవుళ్ల పేర్లతో నినాదాలు చేశారు
జై భీం, సేవ్ కాన్‌స్టిట్యూషన్ అని నినదించిన పలువురు
తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ
న్యూఢిల్లీ, జూన్ 25: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా సభలో భాష, సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. చాలా మంది ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేసేందుకు మొగ్గు చూపారు. అంతేకాకుండా సొంత రాష్ట్రాలకు ప్రాధాన్యం అక్కడి సంస్కృతిని గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సోమవారం ప్రారంభమైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగింది.
అల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం నుంచి గెలుపొందిన ఎంపీలకు నేడు అవకాశం లభించింది. మంత్రుల హోదాలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సోమవారమే ప్రమాణం చేశారు. మిగిలిన ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తెలంగాణ సంస్కృతికి సంబంధించిన నినాదాలను చేశారు మన ఎంపీలు. కడియం కావ్య జై భీం, జై తెలంగాణ అని నినదించగా.. ఈటల రాజేందర్ జై తెలంగాణ, జై సమ్మక్క సారలమ్మ అని ఆకట్టుకున్నారు.
ఈటల రాజేందర్:
మల్కాజిగిరి నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఈటల తెలుగులోనే ప్రమాణం చేశారు. చివరగా జైహింద్, జై తెలంగాణ, జై సమక్క సారలమ్మ అని నినదించారు.
డీకే అరుణ:
మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన డీకే అరుణ తెలుగులో ప్రమాణం చేశారు.
రఘునందన్‌రావు:
మెదక్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన రఘనందన్‌రావు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. జైహింద్, జై తెలంగాణ అని నినాదాలు చేశారు.
ధర్మపురి అర్వింద్:
నిజామాబాద్ స్థానంలో బీజేపీ నుంచి గెలిచిన అర్వింద్ ఇంగ్లీష్‌లోనే ప్రమాణం చేశారు.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి:
చేవెళ్ల నుంచి బీజేపీ తరఫున గెలిచిన విశ్వేశ్వర్‌రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. జైహింద్ అని నినదించారు.
గోడం నగేశ్:
ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి గెలిచిన నగేశ్ హిందీ భాషలో ప్రమాణం చేశారు.
బలరాం నాయక్:
మహబూబ్‌బాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన బలరాంనాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. చివరగా జై తుల్జాభవాని, జై తెలంగాణ అని నినాదాలు చేశారు.
కడియం కావ్య:
వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. చివరగా జై భీం, జై భద్రకాళి, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ రాజ్యాంగ చిరు ప్రతిని ప్రదర్శించారు.
చామల కిరణ్‌కుమార్‌రెడ్డి:
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. జై తెలంగాణ, జై యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి అంటూ నినదించారు.
కొండూరు రఘువీర్:
నల్లగొండ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన రఘువీర్ తెలుగులో ప్రమాణం చేశారు.
మల్లు రవి:
నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలుగులోనే ప్రమాణం చేశారు. పోడియంకు చేరినప్పటి నుంచి ఆయన రాజ్యాంగ చిరుప్రతిని చేతిలో పట్టుకుని చూపిస్తూనే ప్రతిజ్ఞ చేశారు. అయితే, మధ్యలో కొంతమంది సభ్యులు అభ్యంతరం తెలుపగా స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్‌సింగ్ వారిని వారించారు. చివరగా జైహింద్, జై తెలంగాణ, జై కాన్‌స్టిట్యూషన్, జై భీం అని నినాదాలు చేశారు.
సురేశ్‌కుమార్ షెట్కార్:
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ సురేశ్‌కుమార్ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. జైహింద్, జై తెలంగాణ అని నినదించారు.
గడ్డం వంశీకృష్ణ:
పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన వంశీకృష్ణ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. జైహింద్ అని నినాదం చేశారు.
రామసహాయం రఘురామ్‌రెడ్డి:
ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన రఘురామ్‌రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. జైహింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అంటూ నినదించారు.
తెలుగులో తమిళ ఎంపీ ప్రమాణం
లోక్‌సభలో మంగళవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడు కృష్ణగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందిన కే గోపీనాథ్ తెలుగులో ప్రమాణస్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజ్యాంగ చిరు ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రతిజ్ఞ చేశారు. చివరలో జై తమిళనాడు అని నినాదం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైనప్పుడూ ఆయన తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా సమావేశాల్లో ఏదైనా అంశంపై తెలుగులోనే ప్రశ్నలు అడిగేవారు. దానికి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చేవారు.
నా భాషకు గుర్తింపే లేదు
లోక్‌సభలో చాలా మంది ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేసి ఆకట్టుకోగా ఓ ఎంపీ మాత్రం ఆ అవకాశం దక్కనందుకు విచారం వ్యక్తం చేశారు. బీహార్‌లోని సారణ్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన రాజీవ్‌ప్రతాప్ రూడీ మాతృభాష భోజ్‌పురి. కానీ, ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో భోజ్‌పురికి స్థానం దక్కలేదు. అందుకే ఆయన తన మాతృభాషలో ప్రమాణం చేయలేకపోయారు. ఎంపీలు మాతృభాషలో ప్రమాణం స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని ఈ సందర్భంగా రూడీ పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రూడీ విజయం సాధించారు.






