నిందితుడిని విడుదల చేయండి
పుణె కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు తీర్పు
కేసులో తీవ్రత ఉన్నా మైనర్ నిర్బంధం తగదని సూచన
పుణె (మహారాష్ట్ర), జూన్ 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదం కేసులో బాంబే హైకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. నిందితుడిని తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ భారతి, జస్టిస్ మంజుషా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అబ్జర్వేషన్ హోంలో ఉన్న నిందితుడిని విడుదల చేయాలంటూ అతని తల్లిదండ్రులు హేబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. చట్టానికి, జువైనల్ జస్టిస్ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని సూచించింది.
కేసులో తీవ్రత ఉన్నప్పటికీ మైనర్లను సాధారణ వ్యక్తుల్లాగా పరిగణించకూడదని తెలిపింది. ఇప్పటికే బెయిల్ మంజూరైనా కూడా అబ్జర్వేషన్ హోంలో నిర్బంధించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఇచ్చిన ఆదేశాలు చట్టవిరుద్ధమని పేర్కొంది. వయసును పరిగణనలోకి తీసుకోవాలని, పిల్లల్ని నిర్బంధించకూడదని స్పష్టం చేసింది. గత నెల 19 అర్ధరాత్రి పుణెలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడికి సహకరించిన జువైనల్ జస్టిస్ బోర్డు, ట్రాఫిక్ పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.






