2 May, 2026 | 10:28 AM

మేఘ విలయం..

31-08-2025 12:00 AM

ఈసారి వర్షాకాలం సీజన్ కాస్త భిన్నంగా కనిపిస్తున్నది. మాములుగా వానాకాలంలో రుతుపవనాలు చురుగ్గా కదిలితే సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదవ్వడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈసారి మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) తరచూ జరుగుతున్నా యి. ఎలాంటి సంకేతాలు గానీ, ముందస్తు హెచ్చరికలు లేకుండా మేఘాలు విలయం సృష్టిస్తున్నాయి. సాధారణంగా వర్షాలు పడేటప్పుడు మేఘాలు ఉరుముతుంటాయి.

కానీ మేఘ విస్ఫోటం అలా కాదు. మేఘాలు గర్జింజి, విస్ఫోటనాలై పేలిపోతూ క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. వాతావరణ మార్పులు, భౌగోళిక నిర్మాణం, నియంత్రణ లేని నిర్మాణాల వల్ల ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాలే క్లౌడ్ బరస్ట్‌కు కారణం. మేఘ విస్ఫో టం అంటే ఒక చిన్న పరిధిలో, అతి తక్కువ సమయంలో విపరీత వర్షపా తం కురవడం. అంటే ఒక గంటలోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం పడి తే దానినే మేఘ విస్ఫోటం అంటారు.

ఇది సాధారణ వర్షపాతం కంటే చాలా ఎక్కువ. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసే వర్షంతో వచ్చే వరదల వల్ల గ్రామాలు, వంతెనలు, రహదారులు క్షణాల్లో కొట్టుకుపోతాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు, హిమాలయ భౌగోళిక నిర్మాణం కూడా దీనికి అనుకూలంగా ఉంటుంది. సమతల ప్రాంతాల నుంచి వచ్చే తేమ గాలులు కొండలను తాకి పైకి లేస్తాయి. ఎత్తుకు చేరుకున్న ఆ గాలులు ఒక్కసారిగా చల్లబడి, నీటి బిందువులుగా మారి, సుడి గాలి తరహాలో పెల్లుబిక డం చూస్తుంటాం.

ఈ సహజ భౌగోళిక ప్రభావానికి తోడు, వాతావరణ మార్పు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. భూతాపం కారణంగా వాయు మండలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలి మరింత తేమను నిల్వ చేసుకుంటుండటంతో మేఘాలు మరింత బలంగా తయారై, చిన్న పరిధిలోనే తీవ్రమైన వర్షం కురిసే అవకాశముంటుంది. కేవలం ఈ ఒక్క ఆగస్టు నెలలోనే దేశ వ్యాప్తంగా ఎన్నో మేఘ విస్ఫోటనాలు సంభవించాయి.

తాజా గా శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని నాలుగు జిల్లాలను మేఘ విస్ఫోటం అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 11 మంది మృ తి చెందినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క ఉత్తరాఖండ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గత బుధవారం తెలంగాణలోని కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలను క్లౌడ్ బరస్ట్ ముంచెత్తింది. ఫలితంగా ఆగస్టు నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నమోదు కావడం గమనార్హం.

కామారెడ్డి జిల్లాలోని ఆర్గొండ గ్రామంలో అత్యధికంగా 41.83 సె.మీ., రాజంపేటలో 44.05 సె.మీ వర్షపాతం నమోదైంది. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోనూ మేఘ విస్ఫో టం సంభవించడంతో నగరం అతలాకుతలమయ్యింది. ఈ మేఘ విస్ఫోటాలు ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లలో ఎక్కువగా జరుగుతున్నాయి.

మరి ఈ విపత్తులను నివారించడానికి రక్షణ చర్యలకే పరిమితం కావడం సరిపో దు. శాస్త్రీయ ఆధారాలతో ముందస్తు హెచ్చరికలు ఇవ్వగల సాంకేతిక వ్యవస్థలు అవసరం. స్థానిక ప్రజలకు అవగాహన పెంచి, విపత్తు సమయంలో ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా పర్యావరణానికి అనుకూలమైన అభివృద్ధి ప్రణాళికలు అనుసరించాలి. అలా చేయకపోతే ఇలాంటి విపత్తులు తరచూ జరుగుతూనే ఉంటాయి.