2 May, 2026 | 11:52 AM

అంతరిస్తున్న ఉత్తరాలు రాసే కళ

31-08-2025 12:00 AM

పోస్ట్ కార్డు, ఇన్‌ల్యాండ్ కవర్, పోస్టల్ స్టాంపులను మరిచి పోయాం. పోస్టు డబ్బాలో ఉత్తరాలు వేయడం మర్చిపోతున్నాం. వందల ఏళ్లుగా సమాచార వితరణకు వ్యక్తిగతంగా మాట్లాడడంతో పాటు సుదూర తీరాల ఆత్మీయులకు ఉత్తరాలు రాయడం అనే మార్గాలను అనుసరించాం. నేటి డిజిటల్ యుగం లో ఇంటర్నెట్ వేగానికి సంప్రదాయ ఉత్తరాలు రాయడమనే ఆచా రం కొట్టుకుపోయింది.

క్రమంగా ఉత్తరాలు రాసే కళ మసకబారుతోంది. మనం రాసే ఉత్తరాలను స్వీకరించే మన ఆప్తులు వాటిని ఆస్తులుగా భద్రపరుచుకుంటారు. మనకు వచ్చిన అపూర్వ ఉత్తరాలను కూడా ఇదే విధంగా దాచుకునే వాళ్లం. అప్పుడప్పుడు వాటిని చదువుకొని గత స్మృతులను నెమరువేసుకునేవాళ్లం. ఉత్తరాలు రాయడంతో మానవీయ బంధాలు బలపడతాయి. ఉత్తరా ల ప్రాముఖ్యతను వివరించడం, ఉత్తరాలు రాసే కళ పట్ల అవగాహన కల్పించడం, మానవ సంబంధాలను మెరుగు పరుచుకో వడం లాంటి అంశాలను ప్రచారం చేయడానికి సెప్టెంబర్ 1వ తేదీన ‘ప్రపంచ ఉత్తరాలు రాసే దినోత్సవాన్ని’ 2014 నుంచి ఆనవాయితీగా జరుపుకుంటున్నాం.

అయితే నేటి యువతకు ఉత్తరా లు రాసే అలవాటు పూర్తిగా పోయింది. డిజిటల్ వేదికల్లో అర్థం పర్థం లేని సమాచారాలను వేగంగా పంపడం లేదా స్వీకరించడం మాత్రమే వారికి తెలుసు. దీనివల్ల యువతలో ‘ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్’పై అవగాహన లేకుండా పోతుంది. దీనిని గమనించిన కొందరు మేధావు లు ఉత్తరాలకు పూర్వవైభవం కల్పించడానికి ఇలాంటి దినోత్సవాలు జరుపుతున్నారు.

నేడు ఒక పెన్ను, పేపర్ తీసుకొని బాల్య మిత్రులకు లేదా మనల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు లేదా వ్యక్తుల కు ఉత్తరం రాసి వారిని విస్మయపరుస్తూ మీ సత్సంబంధాలను గుర్తు చేయండి. మన అభిప్రాయాలు, భావోద్వేగాలు, మన మధ్య నెలకొన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఉత్తరాలు మాత్రమే ఉత్తమ సాధనాలు అని మరిచి పోరాదు. ఎలాంటి అభిప్రాయాలనైనా స్పష్టంగా, సరళంగా, కళాత్మకంగా, అర్థవంతరీతిలో ఉత్తరాలను రాయడమనే నైపుణ్యాన్ని ‘ఆర్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్’ అని పిలుస్తాం.

ఉత్తరాలు రాసే కళ ఒక రోజులోనో.. ఒక ఉత్తరంతోనో రాదు. దీనిని క్రమంగా అభివృద్ధి చేసుకోవాలి. అత్యంత ప్రభావితం చేసిన ప్రముఖులు రాసిన ఉత్తరాలను చదవడంతో కొన్ని మెలకువలు తెలుసు కోవచ్చు. నేటి యువత, బాలబాలికలకు ఉత్తరాలు రాయడమనే కళ పట్ల ఆసక్తిని పెంచే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఉత్తరం మానవ సంబం ధాలు పెంచే ఓ అద్భుతమైన సాధనం.

ఉత్తరం రాయడానికి లోతైన ఆలోచనలు చేస్తాం. ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసిన ప్రముఖుల ఉత్తరాలు నేటికీ ప్రజాద రణలో ఉన్నాయి. మన సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, పెద్దలతో మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఉత్తరాలు రాసే కళ ఉపకరిస్తుందని తెలుసుకొని ఉత్తరాలు రాయడం అలవాటు చేసుకుందాం. ఉత్తరాలు రాస్తూ మన స్నేహితులు, బంధువులను సంతోష భావాక్షర సాగరంలో ముంచుదాం. 

 మధుపాళీ, కరీంనగర్