ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా సరిత... ప్రశంసించిన సీఎం రేవంత్
హైదరాబాద్: ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత, అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు.
గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. "ఇందిరా మహిళా శక్తి" పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాకు సంస్థాన్ నారాయణపురం మండలం సీతరాంపురం తండాకు చెందిన సరిత మిర్యాలగూడ డిపోలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ (JBM)గా నియమితులయ్యారు. ఆమె ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలకు కీలకమైన కారిడార్‌లలో ఒకటైన హైదరాబాద్-మిర్యాలగూడ(Hyderabad-Miryalaguda) మార్గంలో పనిచేయనుంది. దశాబ్ద కాలంగా డ్రైవింగ్ అనుభవం ఉన్న సరిత ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (Delhi Transport Corporation) నుండి 10 సంవత్సరాల ప్రొఫెషనల్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగి ఉంది. ఆమె నియామకం టీజీఎస్ ఆర్టీసీకి మాత్రమే కాకుండా, సాంప్రదాయకంగా పురుషాధిక్య వృత్తులలోకి ప్రవేశించాలని కోరుకునే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు కూడా గర్వకారణంగా ప్రశంసించబడుతోంది.
సరిత, హైదరాబాద్ నుండి మిర్యాలగూడ రూట్‌లో తన తొలి డ్యూటీని ప్రారంభించారు. గతంలో ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసిన ఆమె, 2017లో తెలంగాణకు వచ్చి టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాన్ని కోరారు. సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో, వారిని చూసుకోవడానికి దగ్గరలో ఉద్యోగం అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఆమెకు ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పించారు. మంత్రి స్పందనతో కలలు నిజమయ్యాయని, ఇప్పుడు తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలయ్యిందని సరిత పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మహిళ ఉద్యోగంలోకి రావడం మాత్రమే కాదు... రాష్ట్రంలో మహిళల సాధికారతకు కొత్త ఆరంభం అన్నారు.
సరిత తలపట్టిన స్టీరింగ్ అనేక మంది యువతులకు కొత్త దారిగా మారుతుంది. పురుషాధిపత్యంగా భావించబడే రవాణా రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం అన్నారు. ఈ చర్య కాంగ్రెస్ ప్రజా పాలనలో మహిళలకు ఎలా ప్రాధాన్యం ఇస్తున్నారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. సరిత లాంటి ధైర్యవంతుల కథలు, ఇతర మహిళలకు కూడా స్ఫూర్తినిస్తాయి. ఇదొక ప్రారంభం మాత్రమే.. అటు ప్రభుత్వం, ఇటు సమాజం కలిసి మహిళల ఎదుగుదలకు వేదికవ్వాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.






