నేడు జడ్చర్లకు సీఎం రేవంత్ రెడ్డి రాక
ఉదండాపూర్ భూ నిర్వాసితులకు నిధులు చెల్లిస్తాం
మౌలిక సదుపాయాలతో
పునరావాసం కల్పిస్తాం
విలేకరుల సమావేశంలో
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, జూన్ 4 : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్లకు విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని, భూ నిర్వాసితులకు ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించిన నిధులను పూర్తిస్థాయిలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితులను గౌరవప్రదంగా పునరావాస ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఉదండాపూర్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం స్వయంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నప్పటికీ, కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా సభను జడ్చర్ల పట్టణంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రేపు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఉదండాపూర్ ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకొని, ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించి, అక్కడి నుంచి నేరుగా జడ్చర్ల పట్టణంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు రానున్నారని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉదండాపూర్ భూ నిర్వాసితుల కళ్లల్లో ఆనందం నింపే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు.
రేపు నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభలో జడ్చర్ల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక సందేశాలు వెలువడనున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజనులు, మహిళలు తరలివచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.






