కేసీఆర్‌ను నమ్మితే మునిగినట్టే..
సికింద్రాబాద్‌లో 20యేండ్ల తర్వాత.. మూడు రంగుల జెండా ఎగురడం ఖాయం
పార్లమెంట్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ.. కేసీఆర్‌ను నమ్మితే నిండా మునిగినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పద్మారావు పరువు తీయడానికే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా బుధవారం ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, మంహాం కాళీ స్ట్రీట్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పద్మారావుకు కేసీఆర్, కేటీఆర్‌ల మద్దతు లేదని, ఈ క్రమంలోనే అతని నామినేషన్ కార్యక్రమానికి ఆ ఇద్దరు కూడా రాలేదన్నారు. 20 సంవత్సరాల తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో మూడు రంగుల జెండా ఎగరనుందన్నారు.
సికింద్రాబాద్‌లో గెలిచేది కాంగ్రెస్..
కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రంలో రాబో యే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తారన్నారు. జంట నగరాల్లో మెట్రో పరుగులకు నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలోనే పురుడు పుసుకొందన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు చేసింది శూన్యం అన్నారు. నాడు దత్తాత్రేయను అంజన్‌కుమార్ యాదవ్ ఓడించాడని, నేడు నాగేందర్ చేతిలో కిషన్‌రెడ్డి ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంత యువ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, దానం నాగేందర్‌ను కూడా గెలిపిస్తే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. సికింద్రాబాద్ స్థానాన్ని కేసీఆర్ బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంన్నారు.
కారుకు ఓటేస్తే మూసీలో వేసినట్లే..
నగరానికి కృష్ణా జలాలు ఎవరు తెచ్చారు అనేది చర్చ పెట్టడానికి తాము సిద్ధమని, కేటీఆర్ సిద్ధమా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కారు గుర్తుపై ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి, కానీ ప్రధాని మోదీ దేవుడిని బజారులోకి తీసుకొచ్చారన్నారు. మత చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నార న్నారు. కానీ కేంద్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని రేవంత్ జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర నిధులతో హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.