క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం: సీఎం రేవంత్
‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్: ‘జాతీయ క్రీడా దినోత్సవం’(National Sports Day) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU), తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.






