29 August, 2026 | 2:46 AM

జల హక్కులపై రాజీ లేదు

29-08-2026 01:39 AM
  1. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం
  2. రావాల్సిన వాటాపై వాదనలు బలంగా వినిపించండి
  3. వాస్తవాలు, న్యాయపరమైన అంశాలతో సిద్ధం కావాలి
  4. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
  5. మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులతో సమీక్ష
  6. తుమ్మిడిహట్టిపై సెప్టెంబర్ 7న సీడబ్ల్యూసీ భేటీ

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : జల హక్కులపై రాజీ లేదని, తెలంగాణ ప్రయోజనాలే ప్రథమం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల్లో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. వాస్తవాలు, సాంకేతిక ఆధారాలు, గత ఒప్పందాలు, న్యాయపరమైన అంశాలతో సమగ్రంగా వాదనలు వినిపించాలని సూచించారు.

సుప్రీంకోర్టు నుంచి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వర కు, కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) వర కు ప్రతి వేదికపై తెలంగాణ వైఖరి ప్రతిధ్వనించాలని స్పష్టం చేశారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శుక్రవారం నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు, న్యాయ నిపుణులు పాల్గొన్న ఈ సమావేశంలో.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న జల వివాదాలు, సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీతో పాటు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు.

తుమ్మిడిహట్టిపై ప్రత్యేక దృష్టి

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సెప్టెంబర్ 1న ఢిల్లీలో తెలంగాణమహారాష్ట్ర అధికారులతో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీ ఎత్తు, మహారాష్ట్ర అభ్యంతరాలు, గతంలో జరిగిన చర్చలు, కుదిరిన ఒప్పందాలు, ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై పూర్తి సమాచారంతో సమావేశానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యేకించి 148 మీటర్ల వద్ద నిర్మాణం చేపట్టే అంశంపై తెలంగాణ వాదనను సాంకేతికంగా బలపరచాలని సీఎం సూచించారు. బరాజ్ ఎత్తుకు సంబంధించి మహారాష్ట్ర లేవనెత్తే అభ్యంతరాలకు గణాంకాలు, సాంకేతిక నివేదికలు, గత నిర్ణయాలను ఆధారంగా చేసుకుని సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. గతంలో జరిగిన చర్చలు, పరస్పర అంగీకారాలు, ఒప్పందాల్లోని అంశాలను కూడా సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.

తుమ్మిడిహట్టి విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశమూ మిగిలిపోకుండా పూర్తి స్థాయి వాదన సిద్ధం చేయాలని, సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యవేక్షించాలని సీఎం సూచించారు.

కృష్ణా జలాల వివాదంపై కఠిన వైఖరి

ఆంధ్రప్రదేశ్‌తో కొనసాగుతున్న కృష్ణా జల వివాదంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరగనున్న కీలక సమావేశానికి పూర్తి సన్నద్ధతతో హాజరు కావాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, విడుదలలు, తాగునీటి అవసరాలు, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై తెలంగాణ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు.

ఇటీవల జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ తన డిమాండ్లను బలంగా వినిపించింది. 2027 ఆగస్టు వరకు తాగునీటి అవసరాల కోసం 112 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరడంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తగినంత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్ చేసింది.

అయితే ఏపీ 47 టీఎంసీల నీటిని కోరడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తుది నిర్ణయం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న జరగనున్న తదుపరి కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.

తాగునీటి అవసరాలపై ముందస్తు ప్రణాళిక

వర్షపాతం పరిస్థితులు, భవిష్యత్తులో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కీలక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

నీటి లభ్యత తగ్గే పరిస్థితుల్లో తాగునీటి అవసరాలపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, నిల్వలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

సుప్రీంకోర్టు కేసులపై సమీక్ష

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు ఉన్న వివిధ జల వివాదాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసుల పురోగతిని కూడా సీఎం సమీక్షించినట్లు సమాచారం. ఆయా కేసుల్లో ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో, ఇతర రాష్ట్రాలు చేస్తున్న వాదనలు ఏమిటో, తెలంగాణ తరఫున ఇప్పటివరకు ఎలాంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన న్యాయ వ్యూహంపై కూడా సమావేశంలో చర్చించారు.

న్యాయవాదులు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. కోర్టుల్లో వాదనలకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యతకు సంబంధించిన గణాంకాలు, ప్రాజెక్టుల సామర్థ్యం, గత ఒప్పందాలు తదితర ఆధారాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

గోదావరి అంశాలపైనా..

మహారాష్ట్రతో సంబంధం ఉన్న గోదావరి జల వివాదాలు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, నీటి వినియోగ హక్కులు తదితర అంశాలపైనా సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. రాష్ట్ర నీటి హక్కులు, ప్రాజెక్టుల వినియోగ సామర్థ్యం, గతంలో కేంద్ర సంస్థలు తీసుకున్న నిర్ణయాలను సమగ్రంగా పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మొత్తంగా అంతర్రాష్ట్ర జల వివాదాలను విడివిడిగా కాకుండా సమగ్ర వ్యూహంతో ఎదుర్కోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.