SIR రివిజన్ జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ కుట్రలు
అర్హులైన ఏ ఒక్క ఓటు పోవద్దు.. అదే ప్రభుత్వ ఉద్దేశం
ఎస్ఐఆర్ జాబితాలో పేరు లేని వారికోసం సవరణ ఏర్పాటు
రాజన్న సిరిసిల్ల: వేములవాడలోని భీమేశ్వరాలయంలో(Bhimeshwara Temple) ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు. 'మన ఇష్టదైవమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sri Raja Rajeshwara Swamy) వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుఖసంతోషాలతో, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది' అని మంత్రి పొన్నం ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఎస్ఐఆర్(Special Intensive Revision)పై రివిజన్ జరిగిన రాష్ట్రాల్లో బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ఆరోపించారు. అర్హులైన ఏ ఒక్క ఓటు పోవద్దని ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ జాబితాలో పేరు లేని వారికోసం సవరణ ఏర్పాటు చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ జాబితాలో పేరు లేనివారు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్‌కు SIR నోటీసులు
అటు ఓటర్ల జాబితాలో తమ కుటుంబ వివరాలకు సంబంధించి వ్యత్యాసాలు వెలుగుచూడటంతో 'ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR) ప్రక్రియలో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరికీ ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో ఉన్న తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బూత్ స్థాయి అధికారి (BLO) రజిత పొన్నం ప్రభాకర్‌కు ఒక నోటీసును అందజేశారు. ఓటర్ల జాబితాలో మంత్రి తండ్రి పేరు 'సత్యనారాయణ'గా నమోదై ఉందని, కానీ ఆయన అసలు పేరు 'సత్తయ్య' అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే, ఈ సవరణకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఆయన్ని కోరారు.
ఇదే ప్రక్రియలో మహేష్ కుమార్ గౌడ్‌కు కూడా ఇలాంటి నోటీసే జారీ చేశారు. నిజామాబాద్‌లోని సిర్నపల్లి గడి పోలింగ్ కేంద్రం పరిధిలోని బూత్ నంబర్ 168లో ఓటు హక్కు కలిగిన గౌడ్, "బొమ్మ" (Bomma) అనే ఇంటిపేరును ఉపయోగిస్తుంటారు. అయితే 2002 నాటి ఓటర్ల జాబితాలో ఇది కేవలం B అనే మొదటి అక్షరంగా మాత్రమే ఉంది. ఆయన తన వివరాల నమోదు ఫారమ్‌లో బొమ్మ అని పూర్తి ఇంటిపేరును పేర్కొన్నప్పుడు, ఎన్నికల అధికారులు ఆ వ్యత్యాసాన్ని గుర్తించి నోటీసు జారీ చేశారు.






