29 August, 2026 | 2:57 AM

47 పైసలకు నోటీసులు వేల కోట్లకు రాయితీలు!

29-08-2026 01:54 AM

సామాన్యులకు కఠిన నిబంధనలు.. బడా బాబులకు భారీ వెసులుబాటు

  1. రుణ వసూళ్లలో ద్వంద్వ వైఖరి
  2. బ్యాంకింగ్ విధానంపై ప్రశ్నలు 
  3. చిన్న బకాయికే చట్టపరమైన చర్యలు
  4. బడా బకాయిదారులకు అండగా దివాలా చట్టం
  5. సమాన నిబంధనలు ఎక్కడ? 
  6. రుణాల రికవరీలో పారదర్శకతపై విమర్శలు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ‘కర్ణాటకలోని తుముకూరుకు చెందిన రమేష్ గౌడ 2021లో ద్విచక్ర వాహన రుణం తీసుకున్నాడు. 2024 ప్రారంభానికల్లా పూర్తిగా రుణం చెల్లించాడు. అయితే, యూపీఐ చెల్లింపులో రౌండింగ్-ఆఫ్ పొరపాటు వల్ల కేవలం 47 పైసల బకాయి మిగిలిపోయింది. దీనిపై బ్యాంకు ఆయనకు నోటీసు పం పింది. ఆలస్య రుసుముతో కలిపి చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సిబిల్ స్కోరు దెబ్బతింటుందని హెచ్చరించింది.’ 

‘మరొక కేసులో సుమారు 22,006 కోట్ల బకాయిలు ఉన్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త దివాలా తీసిన కేసును నేష ల్ కంపెనీ లా ట్రిబ్యునల్  (ఎన్‌సీఎల్‌టీ) (Tribunal (NCLT)) విచారించింది. కేవలం 6.5 కోట్లు చెల్లిస్తే సరిపోతుందనే పునరుద్ధరణ ప్రణాళికను ఎన్‌ఎసీఎల్‌టీ ఆమోదించింది’

చిన్నపాటి రుణాలు తీసుకునేవారిపట్ల, అలాగే భారీగా రుణాలు తీసుకునే వారి పట్ల భారతీయ బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం ఈ ఉదం తాలు.  తాజాగా చోటు చేసుకున్న ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. బ్యాంకింగ్ వ్యవస్థపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న బకాయిల కోసం కఠినంగా వ్యవహరిస్తూ, భారీ రుణాలను మాత్రం రద్దు (రైట్ ఆఫ్) చేస్తున్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. రమేష్‌గౌడ  తనకు వచ్చిన బ్యాంకు నోటీసుపై తనదైన పద్ధతిలో స్పందించాడు. రూపాయి నాణెంతో బ్యాంకుకు వెళ్లి బకాయి చెల్లించి, మిగిలిన 53 పైసల చిల్లరతో పాటు ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం జరిగింది. చివరికి ఆ 47 పైసల లావాదేవీని రౌండ్ ఆఫ్ చేసి, బాకీ ఏమీ లేదని ధృవీకరించింది. ఇక రూ.22,006 కోట్ల క్లెయిములకు గాను కేవలం రూ. 6.5 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికను ఎన్సిఎల్టీ ఆమోదించడమనేది బ్యాంకుల ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. అయితే గతంలోనూ పలు దివాలా కేసుల్లో బ్యాంకులు ఇదే తీరుతో వ్యవమరించడం గమనార్హం. 

రూ. వేల కోట్ల బకాయిలు.. భారీ రాయితీలు

గడిచిన దశాబ్ద కాలంగా దేశ వ్యాప్తంగా భారీ సంస్థలు, బడా వ్యాపారులకు చెందిన బకాయిల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పరిష్కార న్యాయస్థానాలు వ్యవహరిస్తున్న తీరు ఈ ద్వంద్వ విధానాన్ని బట్టబయలు చేస్తోంది. అనిల్ అంబానీకి చెందిన సంస్థల విషయంలో సుమారు రూ. 47,000 నుంచి రూ. 49,000 కోట్ల బకాయిలు ఉండగా, వాటిని రూ.455 కోట్ల నుంచి రూ. 458 కోట్లకే పరిష్కరించారు. అంటే రుణాల్లో 99శాతం కంటే ఎక్కువ రాయితీ (హేర్‌కట్) ఇచ్చారు.

వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి రూ.57,000 నుంచి రూ. 65,000 కోట్ల బకాయిలకు రూ. 2,900 నుంచి రూ.2,962 కోట్లకు, శివ ఇండస్ట్రీస్‌కు చెందిన సుమారు రూ.4,800 నుంచి రూ.4,863 కోట్ల బకాయిలను రూ. 320 నుంచి రూ.323 కోట్ల చెల్లింపులతోనే సరిపెట్టాయి. సినర్జీస్ డోరే ఆటోమోటివ్ సంస్థ రూ. 972 కోట్ల క్లెయిములకు కేవలం రూ.54 నుంచి రూ. 55 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. ఇలాంటి భారీ రాయితీలు, ఉష్దేవ్ ఇంటర్నేషనల్, దెక్కన్ క్రానికల్ లాంటి సంస్థలకు చెందిన కేసుల్లోనూ కనపడతాయి.

అలోక్ ఇండస్ట్రీస్ కేసులో రూ. 29 వేల నుంచి రూ. 30 వేల కోట్ల క్లెయిములకు సుమారు రూ. 5000 నుంచి రూ. 5052 కోట్ల పరిష్కారం లభించింది. అంటే దాదాపు 83 శాతం రాయితీ (హెయిర్‌కట్) లభించినట్టయ్యింది. లాంకో ఇన్‌ఫ్రాటెక్ విషయంలో రూ. 47000 కోట్ల అప్పులకు సుమారు రూ. 5300 కోట్ల పరిష్కారం లభించగా.. సుమారు 88 నుంచి 89 శాతం రాయితీగా చెప్పవచ్చు. రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్  కేసులో సుమారు రూ.41000 కోట్ల క్లెయిములకు కేవలం రూ.4,235 కోట్ల చెల్లింపునకు పరిష్కారం లభించింది.

అంటే రాయితీ సుమారు 89 శాతంగా చెప్పవచ్చు. ఆమ్టెక్ ఆటో విషయంలో సుమారు రూ.12,600 కోట్ల నుంచి రూ.13500 కోట్ల క్లెయిములు రాగా.. రూ.1,900 కోట్ల నుంచి రూ.2700 కోట్ల మధ్య పరిష్కారం లభించినట్టు వివిధ నివేదికలు పేర్కొంటుండటం గమనార్హం.అయితే.. భారీ నష్టాలున్న కొన్ని కేసుల్లో మెరుగైన రికవరీకూడా చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఐబీసీ కేసులోనూ ఇంత భారీగా రాయితీ (హెయిర్‌కట్) ఉండదు.

డీహెచ్‌ఎఫ్‌ఎల్  విషయంలో రూ. 87,000 కోట్ల నుంచి రూ. 91,000 కోట్ల క్లెయిములకుగాను సుమారు రూ. 32,000 నుంచి రూ. 37,000 కోట్ల రికవరీ నమోదయ్యింది. అంటే రాయితీ 60 నుంచి 65 శాతం మధ్యలోనే ఉంది. భూషణ్ పవర్ అండ్  స్టీల్ కేసులో రూ. 47 వేల నుంచి నుంచి రూ.48 వేల కోట్ల బకాయిల్లో రూ.19,000 కోట్లు రికవరీ చేయగలిగాయి.ఇక్కడ కూడా లభించిన రాయితీ 60 శాతం.భూషణ్ స్టీల్ కేసులో మాత్రం రూ.56,000 నుంచి రూ.57,000 కోట్ల క్లెయిములకు రూ.35,000 నుంచి రూ.36,000 కోట్ల రికవరీ లభించింది.

ఈ సంఘటనలో రాయితీ 36 శాతంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో ఎస్సార్ స్టీల్ కేసు పెద్ద కంపెనీల్లో మెరుగైన రికవరీకి ఉదాహరణగా చెప్పవచ్చు. సుమారు రూ.49,000 నుంచి రూ.54,550 కోట్ల క్లెయిములకు రూ.42,000 నుంచి రూ.50,000 కోట్ల పరిష్కారం లభించినట్టు వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి. దీనితో ఈ కంపెనీకి లభించిన రాయితీ 8 శాతం మధ్యలోనే ఉంది.

‘టెక్నికల్ రైట్ ఆఫ్స్’తో వేల కోట్లు మాఫీ

సాంకేతిక రద్దులు (టెక్నికల్ రైట్ ఆఫ్స్) మరొక ఆందోళనకర అంశం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలి కాలంలో.. రుణగ్రహీతల పేర్లను బహిర్గతం చేయకుండా రూ. 35,715 కోట్ల భారీ రుణాలను రద్దు చేయడం పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.అయితే రైట్ ఆఫ్ అంటే రుణాన్ని పూర్తిగా మాఫీ చేయడం, లేదా రికవరీ ప్రయత్నాలను నిలిపివేయడంం కాదు. ఇది ప్రధానంగా బ్యాంకు ఖాతాల్లో రుణాన్ని రికార్డుల నుంచి తొలగించే ఒక అకౌంటింగ్ చర్య. రికవరీ చర్యల తరువాతకూడా కొనసాగవవచ్చు.

బారీగా రాయితీ (హేయిర్‌కట్)లకు అనేక కారణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ పడిపోవడం,  పరిష్కార ప్రక్రియలో ఆలస్యం, కొనుగోలుదారుల నుంచి తక్కువ ఆసక్తి, న్యాయపరమైన వివాదాలు, లిటిగేసన్ ఖర్చులు, కంపెనీ ఆస్తుల క్షీణత,  వంటి అంశాలు బ్యాంకులకు లభించే తుది రికవరీని గణనీయంగా తగ్గిస్తాయి. 

ఐబీసీ ఉద్దేశం: దివాలా మరియు దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) ప్రధాన ఉద్దేశం రుణ సమస్యలను వేగంగా పరిష్కరించడం, ఆస్తుల విలువను కాపాడటం, సాధ్యమైనంత ఎక్కువ రికవరీ చేయడం. అయితే పరిష్కార ప్రక్రియ ఎక్కువ కాలం సాగితే కంపెనీ ఆస్తుల విలువ మరింతగా పడిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో లిక్విడేషన్ ద్వారా లభించే మొత్తంతో పోలిస్తే.. కొంత మెరుగైన రికవరీ వస్తుందనే అంచనాతో రుణదాతలు తక్కువ మొత్తానికైనా పరిష్కార ప్రణాళికలను ఆమోదించే పరిస్థితి ఏర్పడుతుంది.  

అసలు ప్రశ్న 47 పైసలది కాదు..

కర్నాటకలోని రమేష్ గౌడ కేసులో ప్రజల ఆగ్రహానికి అసలు కారణం 47 పైసలు కాదు. వ్యవస్థ చూపిస్తున్న ప్రాధాన్యతలపై ఉన్న అనుమానమే. ఒక సాధారణ రుణగ్రహీత ఖాతాలో మిగిలిన 47 పైసల కోసం ననోటీసులు, ఆలస్య రుసుములు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు వస్తున్న సమయంలో.. రూ. వేల కోట్ల భారీ బకాయిదారుల విషయంలో 90 నుంచి 99 శాతం వరకు రాయితీ (హేయిర్  కట్)తో పరిష్కారం అవుతున్నాయి. 

47 పైసల వివాదం సాంకేతిక లోపాలను కూడా బయటపెట్టింది. యూపీఐ రౌండింగ్ పొరపాటు కారణంగా ఆటోమేటెడ్  సిస్టమ్ నోటీసు పంపగా, దానిని సరిచేయడానికి మానవ జోక్యం అవసరమైంది. నిబంధనల పాటింపు కోసమే అయినా, ఇలాంటి చిన్న మొత్తాలపై అతిగా వ్యవహరించడం వల్ల బ్యాంకు ప్రతిష్టకు జరిగే నష్టం ఆ మొత్తం కంటే చాలా ఎక్కువ.  

ముఖ్యమైన భారీ హేయిర్‌కట్‌లు (90 శాతానికి మించి)

* సుభాష్ చంద్ర (ఎస్సెల్/జీ గ్రూప్ సంస్థలు, వ్యక్తిగత హామీదారు) : ఆమోదించిన క్లెయిములు రూ. 22,006 కోట్లు.. పరిష్కార ప్రణాళిక రూ. 6.5 కోట్లు. రాయితీ (హేయిర్ కట్) సుమారు 99.97శాతం. 2026 ఆగస్టులో క్రెడిటర్ల ఓటింగ్ మద్దతు తరువాత ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది.

* వీడియోకాన్ ఇండస్ట్రీస్ (గ్రూప్ కంపెనీలు) : ఆమోదించిన క్లెయింలు రూ. 57,000  రూ. 65,000 కోట్లు.. పరిష్కారం రూ. 2,900 నుంచి రూ. 2,962 కోట్లు (ట్విన్ స్టార్ టెక్నాలజీస్/వేదాంత). లభించిన రాయితీ (హేయిర్‌కట్) సుమారు 94 శాతం.

* అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలు (ఆర్‌కాం గ్రూప్‌కు సంబంధించిన అంశాలు) : క్లెయింలు సుమారు రూ. 47,000 నుంచి రూ. 49,000 కోట్లు.. కాగా పరిష్కారం మాత్రం రూ.455 నుంచి రూ. 458 కోట్లు. లభించిన హేయిర్‌కట్ 99 శాతం.. అంతకంటే ఎక్కువ.

* శివ ఇండస్ట్రీస్ /శివశంకరన్ సంస్థలు : బకాయిలు రూ. 4,800  నుంచి రూ. 4,863 కోట్లు.. పరిష్కారం రూ. 320 నుంచి రూ. 323 కోట్లు. హేయిర్‌కట్ 93 నుంచి 95 శాతం.

* సినర్జీస్ డోరే ఆటోమోటివ్ : క్లెయింలు రూ. 972 కోట్లు... రికవరీ రూ. 54 నుంచి రూ. 55 కోట్లు. రాయితీ 94 శాతం.

* ఉష్దేవ్ ఇంటర్నేషనల్ : క్లెయింలు రూ. 3,292 కోట్లు.. రికవరీ రూ. 197 కోట్లు. హేయిర్‌కట్  94 శాతం.

* డెక్కన్ క్రానికల్ : బకాయిలు రూ. 8,180 కోట్లు.. రికవరీ రూ. 357 కోట్లు. హేయిర్‌కట్ 95 శాతం.

* ఒరిస్సా మాంగనీస్ అండ్ మినరల్స్/ఇలాంటి చిన్న, మధ్యస్థ కేసులు : తొలి రోజుల్లో నమోదైన కేసుల్లో హేయిర్‌కట్ దాదాపు 94 శాతం నమోదు

* ఏబీసీ షిప్‌యార్డ్/ఇలాంటి కేసులు : లిక్విడేషన్‌కు సమీపంలో లేదా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్న కేసుల్లో సుమారు 95 శాతం వరకు రాయితీ లభించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.

అధిక హేయిర్‌కట్ (70 శాతం)

* అలోక్ ఇండస్ట్రీస్ : క్లెయింలు రూ. 29,000 నుంచి రూ. 30,000 కోట్లు.. రికవరీ రూ. 5,000 నుంచి రూ. 5,052 కోట్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్ + జేఎం ఫైనాన్షియల్). హేయిర్‌కట్ సుమారు 83 శాతం.

* లాంకో ఇన్‌ఫ్రాటెక్/లాంగకో ఇడస్ట్రీస్ : రుణం రూ. 47,000 కోట్లు.. రికవరీ రూ. 5,300 కోట్లు. రాయితీ (హేయిర్‌కట్)  సుమారు 88 శాతం.

* రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ : క్లెయింలు రూ. 41,000 కోట్లు.. రికవరీ రూ. 4,235 కోట్లు (జియో/రిలయన్స్). హేయిర్‌కట్ 89 శాతం.

* అమ్టెక్ ఆటో : క్లెయింలు రూ. 12,600 నుంచి రూ. 13,500 కోట్లు.. రికవరీ రూ. 1,900 నుంచి రూ. 2,700 కోట్లు. హేయిర్‌కట్  79 శాతం.

* మోనెట్ ఇస్పాత్ : క్లెయింలు రూ. 11,500 కోట్లు.. రికవరీ రూ. 2,800 కోట్లు. హేయిర్‌కట్ 75 శాతం.

ఇతర ప్రధాన కేసులు (మధ్యస్థ నుంచి అధిక స్థాయి)

* డీహెచ్‌ఎఫ్‌ఎల్ : క్లెయింలు రూ. 87,000 నుంచి 91,000 కోట్లు.. రికవరీ రూ. 32,000 నుంచి రూ. 37,000 కోట్లు (పిరమల్). హేయిర్‌కట్ సుమారు 60 శాతం.

* భూషణ్ పవర్ అండ్ స్టీల్ : క్లెయింలు రూ. 47,000 నుంచి రూ. 48,000 కోట్లు.. రికవరీ రూ. 19,000 కోట్లు (జేఎస్‌డబ్ల్యూ స్టీల్). హేయిర్‌కట్  సుమారు 60 శాతం.

* భూషణ్ స్టీల్ : క్లెయింలు రూ. 56,000 నుంచి రూ. 57,000 కోట్లు.. రికవరీ రూ. 35,000 నుంచి రూ. 36,000 కోట్లు (టాటా స్టీల్). హేయిర్‌కట్ 36 శాతం (పెద్ద కేసుల్లో మెరుగైన రికవరీ).

* ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ : క్లెయింలు రూ. 13,000 నుంచి రూ. 14,000 కోట్లు.. రికవరీ రూ. 5,000 నుంచి రూ. 5,300 కోట్లు (వేదాంత). హేయిర్‌కట్ సుమారు 60 శాతం.

* ఎస్సార్ స్టీల్ : క్లెయింలు రూ. 49,000 నుంచి రూ. 54,550 కోట్లు.. రికవరీ రూ. 42,000 నుంచి రూ. 50,000 కోట్లు (ఆర్సెలర్ మిట్టల్). హేయిర్‌కట్ చాలా తక్కువ (సుమారు 8 శాతం.. ఇది అత్యధిక రికవరీలలో ఒకటి).