తెలంగాణను 'ప్యూచర్ స్టేట్'గా పిలుస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, (విజయక్రాంతి): ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణను 'ప్యూచర్ స్టేట్'గా పిలుస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తోందని సీఎం పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. బలమైన పునాదులున్న రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని, భారీ రుణభారం తెలంగాణకు సవాల్ గా మారిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేసినట్లు గుర్తు చేశారు. ఆదాయంలో అధికంగా రుణాలు చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పాడిందని, రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉందన్నారు.
నిర్వహణ సరిగా లేకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రుణ సమస్య పరిష్కారానికి తగిన సహాయం, మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక సంఘానికి కోరారు. రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని, రీస్ట్రక్చర్ చేయకపోతే అదనపు ఆర్థిక సాయం చేయాలని సీఎం డిమాండ్ చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని, అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ ను మీ ముందు ఉంచుతున్నామని ఆర్థిక సంఘానికి రేవంత్ రెడ్డి విన్నవించారు. దీంతో తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలని కోరారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యత నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక సంఘానికి హామీ ఇచ్చారు. తెలంగాణ సవాళ్లు అధిగమించేందుకు మీ సిఫారసులు ఉపయుక్తం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.






