8 May, 2026 | 5:13 AM

కేంద్ర పథకాలు పొందడంలో రాష్ట్రాలకు ఇబ్బందులు : డిప్యూటీ సీఎం భట్టి

10-09-2024 01:57 PM

హైదరాబాద్: ప్రజా భవన్‌లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. సమావేశంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... పన్నుల ఆదాయం వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులను కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివని, దీంతో రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రత కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర పథకాల వినియోగానికి కఠిన నిబంధనలు విధిస్తున్నారని, కేంద్ర పథకాలు పొందడంలో రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురావుతున్నాయని భట్టి వెల్లడించారు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్ర పథకాల రూపకల్పన జరగాలని, అందుకు స్వయంప్రతిపత్తి అందించాలని డిమాండ్ చేశారు. రూ.6.85 లక్షల కోట్ల రుణభారంతో తెలంగాణ సతమవుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. సెస్ లు, సర్ ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని, స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని భట్టి సూచించారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంక్షేమ కార్యక్రమాల బలోపేతం, ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినదని ఉపముఖ్యమంత్రి చెప్పారు. తలసరి ఆదాయం ఎక్కువున్నా సంపద, ఆదాయం మధ్య అంతరం ఉందని, అసమానతల కారణంగా రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైందన్నారు. అసమానతల పరిష్కారానికి మౌలిక సౌకర్యాలు, సంక్షేమంపై ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర ఆర్థిక సంఘాన్ని డిమాండ్ చేశారు.