7 April, 2026 | 1:58 AM

కేసీఆర్ క్రీడా స్ఫూర్తిని సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించాలి

07-04-2026 12:01 AM

మాజీ ఎం.పీ. బోయినపల్లి వినోద్ కుమార్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ ౬ (విజయ క్రాంతి ):జిల్లాలో ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్స్ జరగనున్నాయని, ఈ క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ క్రీడాకారులకు, యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

సోమవారం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో వినోద్ కుమార్ కెసిఆర్ కప్ క్రికెట్ పోటీల పోస్టర్స్ ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 12 మండలాల నుంచి 157 జట్లు 175 మ్యాచ్ లను ఆడుతాయని, ఇందులో 2512 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని, యువకులు ప్రతినిత్యం ఆట పోటీల్లో భాగం పంచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు కృషి చేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అయితే గత రెండున్నర సంవత్సరాల నుంచి గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు మురికి కూపాలుగా మారి పిచ్చి మొక్కలతో నిండిపోయాయని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకొని రావాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన క్రీడా స్ఫూర్తిని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలని వినోద్ కుమార్ సూచించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్స్, సెస్ డైరెక్టర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.