మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
సవాయి గూడంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనుల పరిశీలన
వనపర్తిలో సీఎంటీసీ, జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, మే 27 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ముందు గా వనపర్తి మండలం సవాయి గూడం గ్రామంలో వనపర్తి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులను ఎమ్మెల్యే సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, డి ఆర్ డి ఓ ఉమాదేవి పాల్గొన్నారు. అనంతరం వనపర్తి మండలంలో కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ సెంటర్, మరియు జెండర్ రిసోర్స్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారత మరియు సామాజిక అభివృద్ధి కోసం పలు వినూత్న కార్య క్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్‌ఎల్‌ఎన్ మాధవి, డీఆర్డీఓ పి. ఉమాదేవి, అదనపు డీఆర్డీఓ వై. సరోజ, స్థానిక ప్రజాప్రతినిధులు, సెర్ప్ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంస్థల ప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






