1 August, 2026 | 2:03 PM

చందానగర్‌ బంగారం షాపులో లూటీ!

01-08-2026 12:50 PM

 పోలీసులు దర్యాప్తు ముమ్మరం

శేరిలింగంపల్లి, ఆగస్టు 1(విజయక్రాంతి): చందానగర్ ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్(Bajaj Electronics) సమీపంలో ఉన్న ఒక బంగారు దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. శనివారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని లోపలి స్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. వస్తువులు అటూ ఇటూ చెదిరి ఉండటంతో పాటు విలువైన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే చందానగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన ప్రారంభించారు.

క్లూస్ టీమ్ సహకారంతో దుకాణం అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దుండగులు ఏ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించారు, ఎంత మొత్తంలో ఆభరణాలు అపహరించారు, ఒంటరిగా వచ్చారా లేక ముఠాగా వచ్చారా అనే అంశాలపై పరిశోధన జరుగుతోంది.పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించి నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. చోరీకి గురైన బంగారు ఆభరణాల ఖచ్చితమైన విలువను యజమాని నుంచి తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని,నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.