గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ -ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు..
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. శనివారం లోని కొమురంభీం సముదాయంలో గల సమావేశ మందిరంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి ఉమ్మడి జిల్లాల సర్మేడి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారికి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
గోండి భాషను కంప్యూటర్ వ్యవస్థలలో పొందుపరచి అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్య ద్వారానే గిరిజన గ్రామాలు భవిష్యత్తులో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, గిరిజనుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే లక్ష్యంతో గిరిజన ప్రాంతాలలో పర్యాటక రంగ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గిరిజనుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో విద్య, వైద్యం, సంస్కృతి పరిరక్షణ, మార్కెటింగ్ అవకాశాలు, ఉపాధి కల్పన, పరిపాలనా వ్యవస్థ, గిరిజన హక్కులు, మౌలిక వసతుల అభివృద్ధి, కూరగాయల సాగు, వెదురు (బ్యాంబూ) ఆధారిత పరిశ్రమలు, పల్లిపట్టి, మహువా లడ్డూల తయారీ, శానిటరీ న్యాప్కిన్ పరిశ్రమలు, చేపల పెంపకం, గోండి భాష అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సర్మేడి నాయకులు తమ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గిరిజనులు దీపావళి పండుగను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారని, విద్యార్థులకు దసరా, సంక్రాంతి సెలవులకు బదులుగా దీపావళి పండుగకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరారు. కొంతమంది విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తూ సమయపాలన లేకుండా క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొంటున్నారని,
ఈ కారణంగా వారి విద్యాభ్యాసం దెబ్బతింటోందని తెలుపగా శాసనసభ్యులు స్పందిస్తూ పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం స్థానిక మండల కేంద్రంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని మంజూరు చేయడం జరిగిందని, ఈ గ్రంథాలయాన్ని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల సర్మేడి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






