రైతులపై కాంగ్రెస్ కక్షపూరిత వైఖరి
* యూరియా యాప్ బుకింగ్ రైతులకు భారంగా మారింది
* బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి : చల్మెడ లక్ష్మీ నరసింహారావు
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు నివాసంలో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ప్రెస్‌మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేశామని, రైతుబంధు, సాగునీటి వంటి పథకాలతో రైతాంగానికి అండగా నిలిచామని తెలిపారు.
ప్రస్తుతం యూరియా కోసం యాప్ బుకింగ్ విధానం తీసుకురావడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతులకు బోనస్, రైతుబంధు, సాగునీటి విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించిందీ కేసీఆర్ ప్రభుత్వమేనని, ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చల్మెడ లక్ష్మీనరసింహరావు పేర్కొన్నారు.






