27 August, 2026 | 6:56 PM

ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

03-07-2026 04:51 PM

ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను,జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు,ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను ప్రతి నెలా క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఈవీఎం గోడౌన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. తనిఖీలో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించడంతో పాటు సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు.

గోడౌన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతి లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ గోడౌన్‌లోకి అనుమతించరాదని అధికారులకు, భద్రతా సిబ్బందికి సూచించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ తనిఖీలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.