30 April, 2026 | 6:13 PM

స్వీయ గణనకు ప్రజలు సహకరించాలి: జిల్లా కలెక్టర్

30-04-2026 05:02 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉన్న ఇండ్ల గణన కు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె .హరిత కోరారు. గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల,ఆర్డీవో లోకేశ్వరరావు కలసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఇండ్ల గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి పౌరులు పాల్గొని తమ యొక్క ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కోరారు. సాధారణ ప్రజలు సైతం స్వీయ గణనలో పాల్గొనే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.తమ ఇంటి యొక్క వివరాలను నమోదు చేసే సమయంలో ఏదైనా తప్పులు దొర్లితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వచ్చి పరిశీలిస్తారని తెలిపారు.

వేసవి నేపథ్యంలో జాగ్రత్త పడాలి....

వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా పడాలని సూచించారు.ఎన్ఆర్ఈజీఎస్ కూలీలు ఉదయం 10:00 లోపు పనులు పూర్తిచేసుకుని ఇండ్లకు చేరుకోవాలని తెలిపారు.పని ప్రదేశాలలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్న సమయంలో ప్రజలు బయట తిరగవద్దని వృద్దులు,చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇంధన సరఫరాలో ఇబ్బందులు లేవు...

జిల్లాలో పెట్రోల్ ,డీజిల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వాటిని నమ్మి అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రయత్నించవద్దని తెలిపారు.జిల్లాకు రావలసిన సరుకు సకాలంలో వస్తుందని తెలిపారు.ప్రజలు సహకరించాలని కోరారు.

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా...

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ప్రత్యేకంగా పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు.రైతులు హెచ్డి నిషేధిత పత్తి విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. అక్రమార్కులు హెచ్డి పత్తి విత్తనం ద్వారా ఖర్చు తగ్గుతుందని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులు ,మందులకు సంబంధించి తప్పకుండా రసీదులు తీసుకోవాలని సూచించారు.నిబంధనల ప్రకారం డీలర్లు వ్యవహరించాలని ఇప్పటికే ఆదేశించడం జరిగిందని తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఇతర మందులను అంటగట్ట వద్దని ఇప్పటికే డీలర్లను ఆదేశించినట్లు వివరించారు.

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి....

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో రబి సీజన్ కు సంబంధించి 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.సన్న రకాలకు ధర 2389,సాధారణ రకాలకు ధర 2360  క్వింటాలకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు.దీంతోపాటు సన్న రకం వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు.లోడ్ చేసిన వాహనం వివరాలతో పాటు మిల్లు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు.లోడ్ చేసిన వాహనాలకు జిపిఎస్ ట్రాకింగ్ అమర్చడం జరుగుతుందని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి ,ఇళ్ల గణన మాస్టర్ ట్రేనర్ కాంపల్లి ఉషన్న తదితరులు పాల్గొన్నారు.