31 July, 2026 | 2:16 PM

హాస్టల్‌లో లీకేజీలపై కలెక్టర్ ఆరా

31-07-2026 01:25 PM

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో(SC Boys' Hostel) వర్షాల కారణంగా లీకేజీలు ఏర్పడి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో హాస్టల్ పరిస్థితిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు.

తనిఖీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రేకుల షెడ్డు ఉన్న గదుల్లో వర్షపు నీరు కారుతున్నట్లు గుర్తించామని, అయితే ప్రస్తుతం విద్యార్థులు ఉంటున్న గదుల్లో ఎలాంటి లీకేజీలు లేవని ఆమె స్పష్టం చేశారు. స్టోర్‌రూమ్‌లో మాత్రమే నీరు కారుతున్నట్లు గుర్తించామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైతే విద్యార్థులను తాత్కాలికంగా అద్దె భవనంలోకి తరలించి వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. పాత వసతి గృహ భవనం స్థానంలో అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, వసతి సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని హాస్టళ్లలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.