నాణ్యత లోపిస్తే కఠినంగా వ్యవహరిస్తాం
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. శుక్రవారం తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనాల పనులను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతి, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆమోదిత నమూనా ప్రకారం ఇంజినీరింగ్ ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. తరగతి గదులు, హాస్టళ్లు, భోజనశాల, వంటశాల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైనేజీ, ప్రహరీ గోడ వంటి అన్ని సౌకర్యాలు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించిన కలెక్టర్, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతను కాపాడాలని ఆదేశించారు.






