24 July, 2026 | 5:32 PM

వర్షపు నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన

24-07-2026 05:00 PM

భూగర్భ జలాల పెంపు,నీటి కొరత,సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.  

నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. నాగరాజు.

నేరేడుచర్ల,జూలై 24(విజయ క్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ ,8వ వార్డులలో కమిషనర్ వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంతో పాటు డ్రైడే -ఫ్రైడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించే విధానాలు, ఇంటి వద్ద రూఫ్ టాప్ రెయిన్వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.

భూగర్భ జలాల పెంపు, నీటి కొరత నివారణ, భవిష్యత్ తరాలకు నీటి వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.అదేవిధంగా డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ చర్యలను చేపట్టారు. ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రపరచడం, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూల కుండీలు మరియు ఇతర నీరు నిల్వ ఉండే వస్తువులను పరిశీలించి శుభ్రం చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, చికున్గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, మేనేజర్ శ్రీ షేక్ యాకూబ్ పాషా,మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.