24 July, 2026 | 5:47 PM

నీట్ అక్రమాలపై విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాలి

24-07-2026 05:07 PM
  1. నిర్బంధాలతో గొంతు నొక్కలేరు.. 
  2. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడవద్దు 
  3. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు

మనకొండూరు జూలై 24 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా చేస్తున్న విద్యార్థుల ఆందోళనపై పాలక, ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలని, విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడవద్దని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అన్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలు, వారి తల్లిదండ్రుల కలలు ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలో జరిగిన తప్పుల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. అనేక మంది విద్యార్థులు, యువకులు ఆవేదనకు గురై భవిష్యత్ అభద్రత భావానికి లోనై ఆందోళన చెందుతున్నారన్నారు. శుక్రవారం కరీంనగర్ లో విద్యార్థుల దేశవ్యాప్త నిరసనకు సంఘీభావంగా నిర్వహించిన విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు.

ఇది కేవలం ఒక పరీక్షలో జరిగిన తప్పిదం కాదని, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై పడిన మచ్చగా మిగిలిందన్నారు. దీంతో విద్యార్థులు, యువతీ యువకులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఛలో పార్లమెంట్ నిర్వహించారన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా నాణ్యమైన విద్య, మెరుగైన పరీక్ష విధానం కోసం ఢిల్లీలో గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు, బాష్పవాయువులతో కేంద్ర సర్కార్ కర్కషంగా అణిచివేత, దమనకాండకు పాల్పడడాన్ని ప్రజా సంఘాల తరపున తీవ్రంగా 

ఖండిస్తున్నామన్నారు. నిర్బంధాలతో గొంతు నొక్కలేరని విద్యార్థుల న్యాయమైన ఆందోళనలపై పాలకుల ఉదాసీనత, అలసత్వమే దేశ రాజధానిలో యువత, విద్యార్థుల ఉద్యమం తారస్థాయికి చేరిందన్నారు. ప్రజాస్వామ్యంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు గైకొని, కేసులు ఎత్తివేసి విద్యార్థులకు పాలకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్, మెస్ చార్జీలు, స్కాలర్షిప్ లు సకాలంలో చెల్లింపులు చేయాలని, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాలలో లోటుపాట్లు లేకుండా వకడ్బందీగా చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న  ఉద్యోగాల భర్తీలో పాలకులు చేస్తున్న అలసత్వంపట్ల నిరుద్యోగ యువత వయోపరిమితి దాటి ఉద్యోగాలకు నోచుకోక నిరాశ నిస్పృహకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు . పాలకులు తక్షణమే చర్యలు గైకొనకపోతే యువత ఆగ్రహానికి గురై మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇదే అదనుగా ప్రేరేపీత ఆంటీ సోషల్ ఎలిమెంట్ల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కన్నంలక్ష్మణ్,కూరతోట సురేందర్, కల్వకుంట్ల వంశీధర్ రావు, బండ సుధాకర్ రెడ్డి, జనగామ కరుణాకర్ రావు,పిన్నింటి లక్ష్మణ్ కుమార్, జంపాల బాబు , పోల్సాని సునీల్,కనపర్తి సాయి,మిరుదొడ్డి అనిల్,భరత్, మంద మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.