9 July, 2026 | 1:32 AM

పీహెచ్‌సీ, పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

09-07-2026 01:01 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు...

జన్నారం/దండేపల్లి, జూలై 8: జన్నారం మండలంలోని పీ హెచ్ సీ, పాఠశాలలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని అక్కపల్లిగూడ మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను జన్నారం తహసిల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ లతో కలిసి సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరు, రిజిస్టర్లు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పొనకల్ లోని భవిత వనరుల కేంద్రం, మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, మూత్రశాలలు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి వంటశాల, ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కవ్వాల్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, పరిసరాలు పరిశీలించి విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓ.పి. రిజిస్టర్, వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలు పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీలు, ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సమీక్షించారు.

అనంతరం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంద ర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, ఓ.పి. సేవలు, ప్రతిరోజు ఆసుపత్రికి వస్తున్న ప్రజల వివరాలను పరిశీలించారు. గర్భిణులు ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల వివరాలను సేకరించి పోర్టల్ లో నమోదు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రజలలో వ్యాప్తి చెందుతున్న వ్యాధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.