10 March, 2026 | 3:12 AM

పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన సమాజం

10-03-2026 12:27 AM

పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మార్చి 9 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతతో ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా మెరుగైన సమాజం ఏర్పడుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20 వార్డుల్లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు క్రమం తప్పకుండా ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.