04-02-2026 08:30:06 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారిగా పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షిస్తూ ఉండాలని తెలిపారు.
నిర్మాణాలు మందగించిన ప్రాంతాల్లో లబ్ధిదారులతో మాట్లాడుతూ, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని తెలిపారు. నీటిపారుదల వివరాల గణాంక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల వివరాల సర్వేపై తహసిల్దార్ లు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు ఇసుక కొరత తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులు త్వరిత గతిన పూర్తి చేస్తూ ఉండాలని తెలిపారు. మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తుల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ దరఖాస్తులతో పాటు ఇతర పౌర సేవల గుర్తింపు పత్రాలు వెంట వెంటనే జారీ చేస్తూ ఉండాలని తెలిపారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, హౌసింగ్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.