విద్యార్థిని అభినందించిన కలెక్టర్.. జాతీయ స్థాయికి ఎంపిక
సిరిసిల్ల: ప్రతిభ చూపిన విద్యార్థి జక్కని హేమంత్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం అభినందించారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జక్కని హేమంత్, గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తయారుచేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఎగ్జిబిట్ ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయికి ఎంపికైంది. నేతన్నల కష్టాలకు పరిష్కారం చూపేదిగా తయారు చేసిన ఈ ఎగ్జిబిట్ గతంలో పలువురి మన్ననలు పొందింది. ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికవడంతో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థి హేమంత్ తో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలువగా, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయస్థాయికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.






