విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు, సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్ట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతిగృహంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు. ఈ వారం రోజులలో ప్రతిరోజు వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు.
అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






