వైభవంగా ప్రారంభమైన భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలు
వరంగల్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరుగగా, సోమవారం మొదటి రోజు కార్యక్రమాలలో భాగంగా ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణానికి ముందుగా చరుస్థానార్చన నిర్వహించిన అనంతరం భేరీపూజ జరిపి భేరీ తాడనం దేవతాహ్వానం ఆలయ అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఉదయం అమ్మవారిని పర్వతరాజకుమారి (మహేశ్వరి)గా అలంకరించి వృషభ వాహనం మీద, సాయంకాలం అమ్మవారిని మృగవాహినిగా అలంకరించి ఊరేగింపు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శి దేవసేన అమ్మవారిని దర్శించుకున్నారు. అక్షయ తృతీయ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.






