25 August, 2026 | 7:48 PM

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

25-08-2026 07:15 PM

నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలి

పురోగతిలో ఉన్న నిర్మాణ, మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

గంభీరావుపేట కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

గంభీరావుపేట,(విజయక్రాంతి): విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్ పరిశీలించి, తరగతి గదులు, వసతి, తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. 

ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈ లు అన్వర్, సుమలత, ఎంపీడీఓ రాజేందర్, జీసీడీఓ పద్మజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.