అన్ని పాఠశాలలు ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్లు పూర్తి చేయాలి
బోధన్,(విజయక్రాంతి): అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ సూచించారు. మంగళవారం బోధన్ జె.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్‌స్పైర్ అవార్డ్స్, ఎకో క్లబ్స్, ‘ఏక్ పెడ్ మా కే నామ్’, NSPC, SHVR తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ పి. అశోక్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్లు నమోదు చేయాలని సూచించారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి కె. గంగా కిషన్ ఆయా కార్యక్రమాల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆగస్టు 31లోపు ఇన్‌స్పైర్ అవార్డ్స్ నామినేషన్లు, ఎకో క్లబ్స్ నమోదు, నోటిఫికేషన్లు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు విద్యార్థులను చురుకుగా భాగస్వామ్యం చేయాలని ఎంఈఓ నాగయ్య కోరారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






