గుణాత్మక విద్యా బోధన అందించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా నుండి పదవ తరగతిలో ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు గుణాత్మక విద్యా బోధనలు అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
పదవ తరగతి విద్యార్థులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలను తిరిగి పరిశీలించిన కలెక్టర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ. 31 లక్షలు ఉన్నాయని వాటితో అదనపు గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఎ. ఈ ను ఆదేశించారు. ప్రస్తుతానికి బాలభవన్ భవనాన్ని కూడా తాత్కాలికంగా తరగతి గదులుగా వాడుకోవాలని సూచించారు.
ఖాన్ అకాడమీ కంప్యూటర్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం విద్యను బాగా నేర్చుకునేందుకు ఖాన్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్యను విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయిని ఆదేశించారు. బాలికల ఉన్నత పాఠశాలలో ఇప్పటికె కంప్యూటర్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినందున అవసరమైన విద్యను విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాలభవన్ కేంద్రంలో నటరాజ విగ్రహానికి పూజలు చేసిన కలెక్టర్
బాల భవన్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ అక్కడ నాట్య శిక్షణ పొందుతున్న విద్యార్థులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. బాల భవన్ లో ఏ వయసు పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తారు, ఏ ఏ సమయాల్లో నేర్పిస్తారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన నటరాజ విగ్రహానికి దీపం వెలిగించి పూజలు చేశారు. అనంతరం విద్యార్థులతో ఫోటో దిగారు.






