21 May, 2026 | 3:02 AM

పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్ల స్థలాలు చూపించాలని కలెక్టరేట్ ముట్టడి

21-05-2026 01:33 AM

హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

మేడ్చల్, మే 20 (విజయక్రాంతి): ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలో 2002లో పట్టాలు ఇచ్చిన సుమారు 1500 మందికి ఇళ్ల స్థలాలు చూపించాలని బుధవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్ జైపూర్ కాలనీ, బత్తుల గూడా ప్రాంతాలకు చెందిన వారికి కాచవాని సింగారం గ్రామంలోని 66 సర్వే నంబర్ లో పట్టాలు ఇచ్చారు.

కానీ ఇంతవరకు పొజిషన్ చూపించలేదు. దీంతో వారు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రజా పాలనలో అనేకమంది దరఖాస్తు చేశారని, కానీ చాలామందికి ఇల్లు ఇవ్వడం లేదని విమర్శించారు.

ఒకవైపు  స్థలాలు లేవని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, మరోవైపు ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు వేలం వేసే హక్కు ప్రభుత్వానికి లేదని, ఆ భూములను పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని అన్నారు.

తమ జీవితాలు మెరుగుపడతాయని పేద ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తే, నాయకులు పొట్ట నింపుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాలు అమ్మ వద్దని పేద ప్రజలందరూ తిరుగుబాటు చేయాలనే పిలుపునిచ్చారు. కొందరు రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆయన ఆరోపించారు. త్వరలో ప్రధానమంత్రిని కలిసి సిబిఐ విచారణ కు ఆదేశించాలని కోరుతామన్నారు.