రియల్, ఇరిగేషన్ కుమ్మక్కు?
- 9 ఫీట్ల చెరువు కట్టను 30 ఫీట్లుగా పెంపు
- చెరువు కట్టనే రోడ్డుగా మార్చారు
- ములుగు మండలం కమలాబాద్‌లో ఘటన
- పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
గజ్వేల్, ఆగస్టు 24: చెరువు కట్టను అక్రమంగా వెడల్పు చేసి రహదారిగా వినియోగిస్తున్న ఘటన ములుగు మండలం కమలాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ అవసరాల కోసం చెరువు కట్ట స్వరూపాన్నే మార్చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలాబాద్లో గతంలో సుమారు 9 అడుగుల వెడల్పుతో ఉన్న చెరువు కట్టను ఏకంగా 30 అడుగుల మేరకు పెంచినట్లు స్థానికులు చెబుతున్నారు.
అనంతరం అదే చెరువు కట్టను రహదారిగా మార్చి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చెరువు కట్టను అనుమతులు లేకుండా మార్చడం, చెరువులోని మట్టినే భారీగా వినియోగించి రహదారి ఏర్పాటు చేయడం వల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడడంతో పాటు, మరోవైపు ఉన్న రైతుల భూముల విస్తీర్ణం తగ్గిపోయిందని స్థానికులు వాపోతున్నారు.
ఈ వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం చెరువు కట్టను రహదారిగా మార్చిన వ్యవహారంపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని తహసీల్దారుని కోరాము : శ్రీనివాస్, ములుగు డీఈ, ఇరిగేషన్ శాఖ
కమలాబాద్ లో చెరువు యొక్క కట్టను 9 ఫీట్లు ఉండగా అక్రమంగా కొందరు రియాల్టర్లు 30 ఫీట్ల వెడల్పుతో వారి భూమికి రహదారిగా మార్చుకున్నారు. ఈ విషయం మా దృష్టికి రాగానే చెరువు కట్టను పరిశీలించాం. చెరువు కట్ట వెడల్పుతో చెరువు విస్తీర్ణం తగ్గడంతో పాటు మరోవైపు రైతుల భూముల విస్తీర్ణం కూడా తగ్గింది. ఈ విషయమై చర్యలు తీసుకోవడానికి ములుగు తాసిల్దార్ కు ఫిర్యాదు చేశాం.






