25 August, 2026 | 11:35 PM

మధుమలాంచ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల పునర్నిర్మాణం

25-08-2026 09:23 PM

విద్యార్థులు మరుగుదొడ్లను పరిశుభ్రంగా వినియోగించుకోవాలి: డీఈఓ పి. అశోక్

బోధన్,(విజయ క్రాంతి): మధుమలాంచ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మరుగుదొడ్లను రూ.1,34,162 వ్యయంతో పూర్తిస్థాయిలో పునర్నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో మరుగుదొడ్ల సమస్యపై మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు ఎంఈఓ నాగయ్య తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అసోసియేషన్, ట్రస్మా రూ.లక్ష విరాళంగా అందించగా, పూర్వ విద్యార్థులు జి. విద్యాసాగర్ రూ.25 వేలు, ఉదయ్ కిరణ్ మహారాజ్ రూ.2 వేలు, నాగయ్య రూ.7,162 అందించారు.

పునర్నిర్మించిన మరుగుదొడ్లను జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మరుగుదొడ్లను సరైన పద్ధతిలో వినియోగించడంతో పాటు వ్యక్తిగత, పాఠశాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో పాఠశాలలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యం కల్పించేందుకు సహకరించిన దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కిషోర్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బోధన్ మండల అధ్యక్షుడు హరికృష్ణ, కార్యదర్శి సురేష్, విద్యావికాస్ శ్రీనివాస్, చక్రవర్తి, జయప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.