25 August, 2026 | 10:30 PM

విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి

25-08-2026 09:16 PM

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయండి

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కర్నె  సురేందర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కర్నే సురేందర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యా సదస్సు కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి శివన్నారాయణ హాజరై మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జిల్లా విద్యా సదస్సును పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ ప్రగతి నగర్ బాచుపల్లి లో జరగనుందని ఈ సదస్సుకు మేధావులు ఉద్యోగులు రాజకీయ నాయకులు కవులు కార్మికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కర్నే సురేందర్ మాట్లాడుతూ... విద్యకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని,

ప్రభుత్వ పాఠశాలలకు కళాశాలలకు అవసరమైన భవనాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను లెక్చరర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాలని ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్షావలి, నగేష్, సంధ్య, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు టీ. కాలేశా, జావేద్ తదితరులు పాల్గొన్నారు