పార్కు స్థలంలో వాణిజ్య హంగామా!
- మదినగూడలో బిగ్ మార్కెట్ బిజినెస్
- అనుమతులు రద్దయినా ఆగని నిర్మాణం
- హైడ్రా కూల్చినా వీడని ఆక్రమణ బకాయి
- మియాపూర్ టౌన్ప్లానింగ్ అధికారులపై మండిపడుతున్న స్థానికులు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో స్థలానికి ఉన్న రెక్కల ధరలను చూసి అక్రమార్కులు కళ్ళు గప్పుతున్నారు. ప్రజల కోసం కేటాయించిన పచ్చటి పార్కు స్థలాలు ఇప్పుడు వ్యాపార సముదాయాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం(Serilingampally Constituency)... మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని మదీనాగుడా, మంజీరా పైప్లైన్ రోడ్డులో ఉన్న ’ఉషోదయ ఎన్క్లేవ్(Ushodaya Enclave)’ (సర్వే నంబర్ 23) పార్కు స్థలంలో జరుగుతున్న బహుళ అంతస్తుల వాణిజ్య నిర్మాణం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
రూల్స్ బుక్ రద్దయినా.. పనులు మాత్రం జోరుగా...
ఈ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణంపై స్థానికులు జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి జిహెచ్‌ఎంసి ఉత్తర్వు సంఖ్య ఈ /403006 ద్వారా నిర్మాణ అనుమతులను పూర్తిగా రద్దు చేశారు. అయితే, కంటితుడుపు చర్యగా నోటీసులు ఇ చ్చిన అధికారులు, క్షేత్రస్థాయిలో పనులను నిలిపివేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అనుమతులు రద్దయిన మరు సటి రోజే నిర్మాణదారులు పనులను యథేచ్ఛగా కొనసాగిస్తుండడంపై స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా చర్యలకే బురిడీ....
గతంలో ఇదే సర్వే నంబర్ 23లోని ఉషోదయ ఎన్క్లేవ్ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కాంపౌండ్ వాల్స్, తాత్కాలిక నిర్మాణాలను తెలంగాణ ‘హైడ్రా’ బృందం కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అంతటి శక్తివంతమైన వ్యవస్థ చర్యలు తీసుకున్న స్థలంలోనే, తిరిగి బహుళ అంతస్తుల భవనాన్ని లేపడం వెనుక ఎంతటి పెద్దల హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు విమర్శిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై అనుమానాలు
ఫిర్యాదు రావడం, అధికారులు రావడం, ఫొటోలు తీసి నోటీసులు ఇవ్వడం.. ఆ తర్వాత నిర్మాణదారులు పనులు ముమ్మ రం చేయడం నిత్యకృత్యంగా మారింది. కేవలం కాగితాల మీద చర్యలు చూపిస్తూ, క్షే త్రస్థాయిలో నిర్మాణదారులు కోట్లు కొల్లగొట్టే వరకు అధికారులు మౌనంగా చూస్తు న్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలు వైన ఈ ప్రజా ఆస్తిని కాపాడటం లో టౌన్ప్లానింగ్ విభాగం ఘో రంగా విఫలమైంది.
తక్షణమే భవనాన్ని సీజ్ చేయాలి....
ఆక్రమ నిర్మాణంపై వెంటనే బుల్డోజర్లతో చర్యలు తీసుకోవాలని, అనుమతులు రద్దయినా పనులు కొనసాగడానికి సహకరిస్తున్న టౌన్ప్లానింగ్ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని,సర్వే నంబర్ 23 రికార్డులను పరిశీలించి, సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుని పిల్లల ఆటస్థలంగా, పచ్చదనంతో కూడిన పార్కుగా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.