ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
ప్రాణాలతో చెలగటమడుతున్న కంపెనీ యాజమాన్యాలు
నాలుగు నెలల్లో ఐదు ప్రమాదాలు
అయినప్పటికీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వఅధికారులు
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
కంపెనీలను వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్
సంస్థాన్ నారాయణపూర్, మే 2 (విజయక్రాంతి): కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి..వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..అయినా పట్టించుకునే నాధుడే లేడు..కాసుల కక్కుర్తిలో కంపెనీ యాజమాన్యాలు భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలు శూన్యం. మామూళ్ల మత్తులో అధికారుల నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటు న్నారని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని నెలల్లో జరిగిన ప్రమాదాలు
24 జనవరి 2026 లో చౌటుప్పల్ మండలం జైకేసారం పరిధిలోని ఎస్ ఆర్ ల్యాబ్స్ లో ప్రమాదం జరిగి పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 13 ఫిబ్రవరి 2026 లో కొయ్యలగూడెం పరిధిలోని బృందావన్ ఫార్మాలో రియాక్టర్ పేలి కార్మికులు గాయపడ్డారు.
20 ఫిబ్రవరి 2026 లో పోచంపల్లి మండలం దోతిగూడెం పరిధిలోని వీజే సాయి కంపెనీలో ప్రమాదం జరిగి పవన్ అనే కార్మికుడు మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.- 20 ఏప్రిల్ 2026 న చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలోని నోష్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరు తీవ్ర స్థాయిలో గాయాలపాలయ్యారు. - కార్మికుల దినోత్సవం 01 మే 2026 న మరలా అదే నోష్ ఫార్మాలో జరిగిన రియాక్టర్ పేలుడులో ఒక కార్మికుడు మృతి చెందగా 6 అత్యంత ప్రమాదకర స్థాయిలో గాయాలపాలయ్యారు.- -
పుట్టగొడుగుల్లా విస్తరించిన కంపెనీలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ , పోచంపల్లి, నారాయణపూర్,చిట్యాల మండలాల్లో వందలాది కెమికల్ కంపెనీలు తమ ఉత్పత్తుల కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.వివిధ ప్రాంతాల నుండి పొట్టకూటి కోసం వేలాది మంది ఇక్కడ పనిచేస్తున్నారు.ఒక్క చౌటుప్పల్ మండలం పరిధిలోనే 60 కి పైగా కంపెనీలు నెలకొల్పబడి ఉన్నాయి.
ప్రమాదాలు జరిగినా చర్యలు శూన్యం
నిత్యం వేలాది మంది పనిచేస్తున్న కంపెనీలలో కనీస భద్రత ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కెమికల్ మిక్సింగ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టీ పనిచేస్తున్నామని,ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నామని అంటున్నారు.
ఒరిస్సా,జార్ఖండ్,మధ్యప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చే కూలీలు భయంతో సొంత ప్రాంతానికి తిరిగి వెలుతున్నారు.నాలుగు నెలల వ్యవధిలో 5 ప్రమాదాలు జరిగి ఎందరో కార్మికులు గాయాల పాలైనా,కొంత మంది ప్రాణాలు కోల్పోయినా అధికారులు మాత్రం కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కంపెనీ యాజమాన్యాలతో లోపాయికారీ ఒప్పందంతోనే ప్రమాదాలు జరిగిన రెండు రోజులకే కంపెనీ యధాతథంగా నడుస్తున్నాయని ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
పరిశీలనల తర్వాతే అనుమతులు ఇవ్వాలి :
కంటి తుడుపు చర్యలతో అధికారులు కంపెనీ యాజమాన్యాలు చేతులు దులుపుంటున్నాయని భవిష్యత్తులో మరల ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనడానికి నోష్ ఫార్మాలో 10 రోజుల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాలను చూస్తే అర్ధం అవుతుందని ప్రజలు అంటున్నారు.కంపెనీల అనుమతులను రద్దు చేసి మరల భవిష్యత్తులో ప్రమాదాల నివారణ కోసం చేసిన ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులు పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కంపెనీలను ఇక్కడి నుండి తరలించాలి
‘గత కొంతకాలంగా చౌటుప్పల్ మండలం పరిధిలోని కంపెనీలలో జరుగుతున్న ప్రమాదాలతో భయంతో బతుకుతున్నాం. ్ర పమాదం జరిగినప్పుడు వెలువడే విషవాయువులతో ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి.పరిశ్రమలను ఇక్కడినుండి తరలించాలి.భద్రత పాటించని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకొని సీజ్ చేయాలి.
- అంతటి నగేష్, చౌటుప్పల్ స్థానికుడు






