17 August, 2026 | 2:26 AM

కదన కుతూహలమే!

17-08-2026 01:47 AM

మూడు పార్టీలకు ముప్పేట సమస్యలు

  1. హామీల వైఫల్యం, ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ దృష్టి సారించాలి
  2. కేసీఆర్ బయటకు రావడమే మార్గం
  3. బీజేపీకి ఛరిష్మా ఉన్న నేత కావలెను!

తెలంగాణ అసెంబ్లీకి అటుఇటుగా రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని మూడు ప్రధానమైన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు రాబోయే ఎన్నికలకు సన్నద్దం కావాల్సిన సమయం అసన్నమయ్యింది. ఇందుకు ముందుగా తమ తమ వైఫల్యాల నుంచి బయటపడి, నష్ట నివారణ చర్యలు దిగితేగానీ.. వచ్చే ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అనేలా ఉత్సాహం ఉరకలెత్తే పరిస్థితి లేదు. ఇందుకు అన్ని పార్టీలు తాజా పరిణామాలను అత్యంత లోతుగా పరిశీలిస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాంగ్రెస్‌కు గుదిబండగా హామీలు..

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి మెల్లమెల్లగా మద్దతు బలపడుతున్నట్లు కనిపిస్తున్నది. పైగా రాష్ట్ర స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మీడియా మద్దతు కూడా స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంలో.. దాదాపు 25 మంది ప్రజలతో సత్సంబంధాలునెరపకపోయారు. దాంతో వారు వెనుబడినట్టుగా తాజా సర్వేలో బయటపడినట్టు తెలుస్తోంది.

ఈ స్థానాల్లో కొత్తవారిని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం గుర్తించా ల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి. దీనికితోడు అంతర్గతర కుమ్ములాటలు పార్టీకి తీవ్రనష్టాన్ని కలిగించేలా మారుతున్నాయి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించ డం అత్యావశ్యం. అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత సమర్థుడైన నాయకుడు అయినప్పటికీ.. ప్రభుత్వంపై వ్యతిరేకతతోపాటు, హామీల వైఫల్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయేలా.. ఒక కొత్త వినూత్న పథకాన్ని తీసుకురావాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పెద్దఎత్తున విస్తరిస్తే ప్రజల నుంచి మద్దతు కూడా ఆవిధంగానే ఉంటుంది. దీనితోపాటు రాబోయే ఎన్నికల వ్యూహాలను ఇప్పటినుంచే అమలు చేయాల్సి ఉంది.

కేసీఆర్ వస్తే.. ప్రభంజనం..

ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ బలంగా దూసుకుపోతున్నది. అయితే బీఆర్‌ఎస్ మద్దతు పెరగడానికి ప్రధాన కారణం.. అధికార పక్షం కాంగ్రెస్‌పై వ్యతిరేకతే. ఒకవైపు అవినీతి, మరోవైపు హామీల వైఫల్యం వల్ల ప్రజలు బీఆర్‌ఎస్ వైపు మళ్లుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న 29 మంది ఎమ్మెల్యేలో కనీసం ఆరుగురిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనేది సమాచారం. వారిని తప్పకుండా మార్చాల్సిన అవసరం కనపడు తోంది. బీఆర్‌ఎస్‌కు ఉన్న అత్యంత ప్రజాదరణ కలిగిన నేత కేసీఆర్.

ఆయన ప్రజల్లోకి మళ్లీ వస్తే ప్రభంజనంలా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా బస్సు యాత్ర లాంటిది కేసీఆర్ చేపడితే ప్రజల్లో తీవ్ర కదలిక తీసుకురావడం ఖాయం. గతంలో తప్పులు చేసినవారి స్థానంలో కొత్తవారిని తెరపైకి తీసుకురావాలి. అలాగే పార్టీలోని కీలకమైన నేతలు కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య మరింత సమన్వయం అవసరం. అలాగే కేటీఆర్ మరింత సమయాన్ని క్యాడర్ కోసం, ప్రజల కోసం వెచ్చించాల్సి ఉం టుంది. సొంతంగా మీడియా ఉండటం బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం.

మరింత బలహీనంగా బీజేపీ..

మిగతా పార్టీలతో పోల్చితే.. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటికి మూడో స్థానంలోనే కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నకొద్ది.. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది.. బీజేపీ మరింత బలహీనంగా మారుతున్న సంకేతాలు వస్తున్నాయి.         ఇవి ఆ పార్టీకి హెచ్చరికలే. తాజాగా నీట్ పేపర్ లీకేజీ, అయోధ్యలోని శ్రీరామ మందిరంలో విరాళాల అక్రమాలు ఆ పార్టీకి తలవంపులు తెచ్చాయి. రాష్ట్ర బీజేపీకి కనీసం ఒక్కరైనా రాష్ట్రస్థాయి ఛరిష్మా ఉన్న నేత, బలమైన ఇన్‌చార్జ్ కావాలని.. తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

అవకాశం ఉంటే.. అలాంటి ఛరిష్మా ఉన్న నేతను తెలంగాణలో బీజేపీ తరఫున సీఎంగా ప్రచారం చేయాలనే ఆకాంక్ష ప్రజల నుంచి వస్తున్నది. ఉత్తర భారతంలోలాగా.. తెలంగాణ రాజకీయాల్లో హైకమాండ్ ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడంగాని, రాష్ట్రంలో అంత ప్రభావ వంతంగా పనిచేసిన దాఖలాలుగాని కనపడటం లేదు.

పైగా రాష్ట్రంలో బీజేపీకి మీడియా నుంచి ఎలాంటి మద్దతు లేదు. ఇలాంటి సమయంలోనే.. ప్రజలను ఆకర్శించేలా, మద్దతు కూడగట్టేలా ఉండే వినూత్నమైన నిర్ణయాలు ఆ పార్టీ తీసుకోవాల్సి ఉంది. అదీకాకుండా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ బలమైన, కఠువైన నిర్ణయాలు తీసుకోకపోతే.. ఆ పార్టీకి బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే పరిస్థితి వస్తుంది.