టీసీసీఓల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
- 20 ఏళ్ల సేవలకు ప్రతిఫలమేది!
- జీతాలు లేవు.. ఉద్యోగ భద్రతా లేదు
- సీసీఎల్‌ఏ మెమోతో 632 మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన
- విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్
బాన్సువాడ, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో గత రెండు దశాబ్దాలుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించిన 632 మంది టైపిస్ట్ -కం-కంప్యూటర్ ఆపరేటర్లు (టీసీసీసీవో) ప్రస్తుతం తీవ్ర ఆందోళన, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవల్లో భాగమై పనిచేస్తూ రెవెన్యూ శాఖకు వెన్నెముకలా నిలిచిన వీరి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖల్లో టీసీసీవోలు కీలక పాత్ర పోషిస్తున్నారు. భూముల రికార్డుల నమోదు, నిర్వహణ, రెవెన్యూ డేటా నమోదు, ధ్రువపత్రాల జారీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు సంబంధించిన పలు సేవల నిర్వహణలో వీరు నిరంతరం సేవలందిస్తున్నారు. ముఖ్యంగా డిజిటలైజేషన్ ప్రక్రియలో రెవెన్యూ శాఖలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పని చేస్తూ ప్రభుత్వ వ్యవస్థలో అంతర్భాగంగా మారారు.
అయితే ఇటీవల చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సిసిఎల్‌ఏ) కార్యాలయం నుంచి టిసిసిఓల సేవలను నిలిపివేయాలని జారీ చేసిన మెమో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఒక్కసారిగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ ఉద్యోగ భద్రత ఏమవుతుందో, కుటుంబాల భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో టిసిసిఓలు పెండింగ్ జీతాల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.
చాలామంది ఉద్యోగులు తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని ప్రభుత్వ సేవలకే అంకితం చేశామని, ఇప్పుడు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేకుండా సేవలను నిలిపివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగమై పనిచేసిన తమ సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని టిసిసిఓలు కోరుతున్నారు. లేకపోతే వందలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
32 జిల్లాల కలెక్టర్ల నివేదికలు కూడా పట్టించుకోలేదా?
టిసిసిఓల ఉద్యోగ సంఘాల సమాచారం ప్రకారం రాష్ర్టంలోని 32 జిల్లాల కలెక్టర్లు సైతం టిసిసిఓల సేవలు ఇప్పటికీ అవసరమని సిసిఎల్‌ఏ కార్యాలయానికి నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు, ప్రజా పరిపాలనలో వీరి పాత్ర కీలకమని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
అయినప్పటికీ, జిల్లా స్థాయి అధికారుల అభిప్రాయాలు, అవసరాలపై నివేదికలు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సేవల నిలిపివేత దిశగా చర్యలు కొనసాగడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. క్షేత్రస్థాయిలో మా సేవలు అవసరమని అధికారులు చెబుతుంటే, ఉద్యోగాలను ఎందుకు ప్రశ్నార్థకం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని టిసిసిఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల ఆవేదన
మేము గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో ఉన్నాం. ప్రజలకు సేవలు అందించాం. ప్రభుత్వ పనుల్లో భాగస్వాములమయ్యాం. కానీ ఇప్పుడు మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మా కుటుంబాల పరిస్థితి ఏమవుతుందో తెలియడం లేదు అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిసిసిఓ సంఘ సభ్యులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ వారి ప్రధాన డిమాండ్లు ఉద్యోగాలను కొనసాగించాలి,పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
15 నెలలుగా జీతాలు లేవు
గత 15 నెలలుగా వేతనాలు అందక టిసిసిఓలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. నెలల తరబడి జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ, తమకు రావాల్సిన వేతనాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
పిల్లల విద్యా ఖర్చులు, ఇంటి అద్దెలు, వైద్య అవసరాలు, కుటుంబ పోషణ, రోజువారీ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తుండగా, మరికొందరు స్నేహితులు, బంధువుల సహాయం తీసుకుని జీవనం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. జీతాలు లేక ఒకవైపు ఆర్థిక భారాలు పెరుగుతుండగా, ఇప్పుడు ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారడంతో మరింత ఆందోళనకు గురవుతున్నామని పేర్కొంటున్నారు.






