ఆ అధికారులు బోన్‌లో నిలబడక తప్పదు
- భాగ్యలక్ష్మి మినరల్స్‌కు విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారు?
- వెంటనే ఆ మినరల్స్‌ను సీజ్ చేయాలి
- బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): విద్యుత్ చట్టం ప్రకారం అక్రమాలకు పాల్పడిన అధికారులు బోన్‌లో నిలబడక తప్పదని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. భాగ్యలక్ష్మి మినరల్స్‌కు ఎలాంటి కాగితాలు లేకున్నా ట్రాన్స్ కో విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తుందని, వాళ్లకు సేల్‌డీడ్ లేదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ప్రవీణ్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్‌కు మా బృందం రెండు సార్లు వెళ్లింది.. పదిహేడు ఎకరాల్లో అక్కడ రెడీ మిక్స్ ప్లాంట్ లు పెట్టారన్నారు. మానస హిల్స్ క్రషింగ్ కంటే భాగ్యలక్ష్మి మినరల్స్ ఎన్నో రెట్లు పెద్దది.. ట్రాన్స్ కో ఇండస్ట్రీ కోటా కింద భాగ్యలక్ష్మి మినరల్స్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం చట్ట విరుద్ధమని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం బంధువు అనే ట్రాన్స్ కో అధికారులు అక్రమంగా కనెక్షన్ ఇచ్చారు....వెంటనే భాగ్యలక్ష్మి మినరల్స్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
క్రిశాంక్‌ను సంవత్సరం పాటు జైల్లో ఉంచేలా సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారని....నిజానికి జైల్లో పెట్టాల్సింది రేవంత్ రెడ్డి ,పొంగులేటిని అని ప్రవీణ్‌కుమార్ మండపడ్డారు. కరీంనగర్‌లో పట్టపగలు నగల దుకాణంలో దొంగతనం జరిగితే రాష్ట్ర, కేంద్ర హోం మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఉందా అని నిలదీశారు. ఇంతవరకు కరీంనగర్ కు సీఎం వెళ్ళకపోవడం ఏమిటీ అన్నారు.
బండి సంజయ్ ఆఫీస్‌కు కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగితే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంత సేపు పోలీసుల శ్రద్ద బీఆర్‌ఎస్ నేతల మీద అక్రమ కేసులు పెట్టడం మీదనేనా? అన్నారు. బీహార్ కన్నా రాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా మారాయన్నారు. కేసీఆర్ హయం లో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసామన్నారు..లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి భాద్యత వహిస్తూ రేవంత్ ,బండి సంజయ్ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.






