30 July, 2026 | 2:22 AM

అల్వాల్‌లో గజానికి రూ.1.10 లక్షల పరిహారం

30-07-2026 01:30 AM

ఎలివేటెడ్ కారిడార్ కు చివరి దశకు చేరిన భూసేకరణ 

మేడ్చల్, జూలై 29(విజయ క్రాంతి): సికింద్రాబాద్ నుంచి షామీర్పేట్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి భూ సేకరణ చివరి దశకు చేరింది. ఎలివేటెడ్ కారిడారుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఐదు గ్రామాల్లో భూసేకరణ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల వారు తమ ఆస్తులను కోల్పోతున్నారు. ఇప్పటికే పోతాయిపల్లి, లోతుకుంట, తూము కుంట గ్రామాల్లో భూసేకరణ పూర్తయింది. అల్వాల్ లో భూమి విలువ ఎక్కువగా ఉండటం వల్ల పరిహారం అందించే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు.

బుధవారం జరిగిన జిల్లా స్థాయి భూసేకరణ కమిటీ సమావేశంలో పరిహారం ధరను గజానికి లక్ష పదివేల రూపాయలుగా నిర్ణయించారు. ఈ ధరకు నిర్వాసితులు కూడా అంగీకరించారు. అల్వాల్లో కూడా భూసేకరణ సమస్య కొలిక్కి రావడంతో ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. వచ్చేనెల లో భూ యజమానులందరికీ పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూ సేకరణ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ మాలతి, ఇతర ఉన్నతాధికారులు, భూ యజమానులు పాల్గొన్నారు.