ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి
రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న మూడు జిల్లాల ప్రజలు
గత వర్షాకాలం భారీ వరదతో మరింత ప్రమాదంగా మారిన బ్రిడ్జి
మళ్లీ వర్షాలు వస్తే ఇబ్బందులే
మరమ్మతులు చేపట్టాలని కోరిన పట్టించుకోని అధికారులు
అధికారులకు,ప్రజా ప్రతినిధులకు విన్నవించిన గ్రామస్తులు
బిబిపేట్, జూలై 29 (విజయక్రాంతి): నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. మూడు జిల్లాల ప్రయాణికులకు అనుకూలంగా ఉన్న ఈ బ్రిడ్జి గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు ధ్వంసం అయింది. కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. గత సంవత్సరం భారీ వర్షాల వల్ల నెల రోజులకు పైగా మూడు జిల్లాల ప్రయాణికులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసి తాత్కాలికంగా ప్రయాణ సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. అప్పటినుంచి శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు బిబిపేట గ్రామస్తులు విన్నవించారు. వర్షాకాలం వస్తే మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే కొత్త బ్రిడ్జి మంజూరు చేయించాలని గ్రామస్తులు కోరారు.
హామీలు ఇచ్చారు మరమత్తులు మర్చారు
అధికారులు, ప్రజాప్రతినిధులు బివిపేట బ్రిడ్జి నిర్మాణం కోసం హామీలు ఇచ్చారు. కనీస మరమ్మత్తులు చేపట్టలేదు. ప్రస్తుతం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి పై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు కూలు తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈసారి గత సంవత్సరం లాగా భారీ వర్షాలు కురిస్తే శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయే అవకాశం ఉంది. గత నిజాం కాలంలో నిర్మించడంతో డంగు సున్నం కలిపి బ్రిడ్జిని నిర్మించారు. దీంతో బ్రిడ్జి చెక్కుచెదరకుండా భారీ వర్షాలు వరదలు వచ్చిన, తాత్కాలికంగా ధ్వంసం అయింది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు బ్రీడ్జి మొత్తం ధ్వంసం అయింది.
నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందు చూపుతో ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బిబిపేట్ గ్రామస్తులు కోరుతున్నారు.
మూడు జిల్లాల ప్రయాణికులకు అనుకూలం
మూడు జిల్లాల వారధిగా ఉన్న ఈ బ్రిడ్జి సిరిసిల్ల రాజన్న జిల్లా, సిద్దిపేట జిల్లా, కామారెడ్డి జిల్లా ప్రజలకు ఈ రోడ్డు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేస్తే సమయభావంతో పాటు దూర భారము తగ్గుతుంది. దీంతో మూడు జిల్లాల కూడలిగా ఉన్న బీబీపేట బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
కొత్త బ్రిడ్జి నిర్మించాలి
మూడు జిల్లాలకు అనుకూలంగా ఉన్న బ్రిడ్జి శిథిలావస్థ కు చేరింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ నిత్యం ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతి నిధులు స్పందించి ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి.
- కొరివి నీరజ, గ్రామస్తురాలు, బిబిపేట






