08-12-2025 12:00:00 AM
ఐక్యతతోనే అభివృద్ధి చేసుకుందాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, డిసెంబర్ 7 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామాల ప్రజలు ఐక్యతను చాటి అభివృద్ధిలో పోటీపడాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని రామాంచ గ్రామ ప్రజల ఐక్యతతో సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకోవడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంతోషం వ్యక్తం చేసారు.
ఏకగ్రీవం అయిన రామంచ గ్రామ సర్పంచ్ ఎర్ర భవాని నవీన్ లు గ్రామస్తులతో కలసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు సిద్దిపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, నంగునూర్ మండలంలోని ఖాతా, సంతోష్ నగర్, సిద్దిపేట అర్బన్ మండలంలో బొగ్గులోని బండ, చిన్న కోడూరు మండలంలో రామంచ గ్రామాలు ఏకాగ్రీవం అయ్యాయని తెలిపారు.
ఊరంతా ఒక తాటి మీదకు వచ్చి ఒక్కరూ పోటీలో ఉంటే చాలు అందరం ఒకటే పార్టీ, కెసిఆర్, హరీష్ రావుల వైపు ఉండే గ్రామం రామంచ గ్రామం అని, 20ఏళ్ల కిందట మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం ఈ గ్రామం కొనుగోళ్లలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. రూ.2కోట్లతో గ్రామంలోని నాగరేశ్వర దేవాలయం నుండి సిరిసిల్ల రోడ్డును కలుపుతూ రోడ్డు చేసుకున్నామని, రూ.2కోట్లతో రామంచ నుండి రంగనాయక స్వామి గుట్ట నుండి చంద్లపూర్ గ్రామం వరకు రోడ్డు మంజూరు చేసుకున్నామని త్వరలోనె పనులు ప్రారంభం అవుతాయాన్నారు..
రామంచలోని 3, చంద్లపూర్ లో 3, మాచపూర్ లో 2చెరువులను నింపే రంగనాయక లిఫ్ట్ పనులు కూడా అవుతున్నాయని వచ్చే కొద్దీ రోజుల్లోనే చెరువుల్లోకి నీళ్లు రాబోతున్నాయన్నారు. గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నాం భవిష్యత్ లో కూడా అద్భుతం గా చేసుకుందాన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు, ఆయా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.