సీఎం రేవంత్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలి
ఎంజీఎంలో కరెంట్ కోతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి): మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని, అప్పుడే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయని వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆరు గంటల పాటు కరెంట్ పోవడంతో కార్డియాలజీ, డయాలసిస్, పిల్లల, ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యమే దీనికి కారణమని, వెంటనే విచారణ జరిపి సీఎంపై తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం బక్క జడ్సన్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో ఎంజీఎంలో పేషంట్లను ఎలుకలు కొరికాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పరిస్థితి ఏమాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, ఎంజీఎం ఆస్పత్రుల్లోని సమస్యలపై ఒక్కరోజు కూడా ప్రభుత్వం కూడా సమీక్ష నిర్వహించలేదని ఆరోపించారు. భువనగిరిలో సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో వైద్యం అందించడం బాధాకరమన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైతే ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటానని, పేదల వైద్యం కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.






