నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ హల్‌చల్
మార్నింగ్ వాకర్స్‌తో గొడవపడిన యువతీ యువకులు
నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఘటన
వైరల్‌గా మారిన యువతీ యువకుడి వీడియో
ఎల్బీనగర్, మే 24 : పగలు, రాత్రి అనే తేడా లేకుండా కొంతమంది యువతీ యువకులు బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలాంటి ఘటనే శుక్రవారం నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన యువతీయువకుడు బీర్లు, సిగరెట్ తాగుతూ రోడ్డుపై నానా హంగామా చేశారు.
రోడ్డుపై తాగొద్దని మార్నింగ్ వాకర్స్ వారిని వారించినప్పటికీ.. వారి మాటలు లెక్క చేయకుండా కారులో పాటలు పెట్టుకుని, బీరు తాగుతూ అడ్డు వచ్చిన వారిని తిడుతూ నానా హంగామా సృష్టించారు. ఇది పద్దతి కాదని కొందరు పెద్దలు చెప్పినా వినకుండా మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు వారిని తూలనాడారు. పైగా, మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారు.. వారిని ఏమంటారని ఓ పెద్దాయన్ని ఎదురు ప్రశ్నించారు. అయనతో కొద్దిసేపు వాదించారు. మార్నింగ్ వాకర్స్ అక్కడికి చేరుకోగా.. గొడవ పెద్దది అవుతుండడంతో అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. వీరిపై చర్యలు తీసుకోవాలని మార్నింగ్ వాకర్స్ డిమాండ్ చేశారు.






