17 August, 2026 | 2:12 PM

హెచ్‌ఎం పోస్టు భర్తీకి ప్రజావాణిలో ఫిర్యాదు

17-08-2026 01:08 PM

నాగల్‌గిద్ద, ఆగస్టు 17,(విజయక్రాంతి): నాగల్‌గిద్ద జడ్పీ ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ హెచ్‌ఎం పోస్టు(Regular Headmaster post) ఖాళీగా ఉండటంతో పాఠశాల నిర్వహణ, విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం పడుతోందని కేవీపీఎస్ జిల్లా నాయకుడు గణపతి అన్నారు. ఈ సమస్యపై సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం హెచ్‌ఎంగా పనిచేస్తున్న అధికారి జిల్లా సైన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పాఠశాలపై పూర్తిస్థాయిలో దృష్టి, పర్యవేక్షణ లేకపోతోందని ఆరోపించారు. హెచ్‌ఎం అందుబాటులో లేకపోవడంతో పాఠశాల పరిపాలనతో పాటు విద్యార్థుల విద్యా కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ఇదే పరిస్థితి కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లోనూ ఉందని, ఆయా పాఠశాలలకు సరైన పర్యవేక్షణ లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నూతన ఎస్సీ హాస్టల్‌లో సుమారు 80 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ రెగ్యులర్ హెచ్‌ఎం లేకపోవడంతో హాస్టల్, పాఠశాల పరిపాలనకు సంబంధించిన పలు సమస్యలు ఎదురవుతున్నాయని గణపతి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నాగల్‌గిద్ద జడ్పీ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న హెచ్‌ఎం పోస్టును వెంటనే రెగ్యులర్ హెచ్‌ఎంతో భర్తీ చేయాలని కోరారు. కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లోనూ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన పరిపాలన అందేలా చూడాలని గణపతి డిమాండ్ చేశారు.